11, మే 2013, శనివారం

అమ్మా..... నేనే బాబు ను ....!

ఇవాళ అంతర్జాతీయ మాతృదినోత్సవం అని చెప్పారు. అమ్మకు ఒక రోజు
కేటాయించటం ఏమిటి అని వాదించే పిచ్చి కొడుకుల్లో నేనూ ఒకడినే.
అయినా ఎందుకో ఒక్కసారి అమ్మను స్మరించుకుంటూ గతంలో అమ్మ
గురించి నేను రాసుకున్న పాట మళ్లీ గుర్తు చేసుకుందామనిపించింది.


    పల్లవి :           అచ్చ తెలుగు భాషరా అమ్మంటే....  
                         అచ్చు వేద ఘోషరా అమ్మంటే....   

 అనుపల్లవి :       ఆప్యాయత కంచంలో అనుబంధంలా 
                         తొలి అన్నం ముద్దరా అమ్మంటే..... 
                         ఆత్మీయత ఫలకంపై అనురాగంలా 
                         తొలి అక్షర ముత్యంరా అమ్మంటే.....    // అచ్చ తెలుగు //


   చరణం 1 :       ఆకసాన సృష్టికర్త బ్రహ్మ రా 
                         అవని మీద సృష్టికర్త అమ్మరా 
                  
                         గొదారీ కాశ్మీరం ఓ తిరుపతి క్షేత్రం 
                         నీ ధ్యాసే నిరంతరం ఇదే అమ్మ గోత్రం !

                         అమ్మంటే స్వచ్చమైన శ్వాసరా 
                         అమ్మంటే స్పష్టమైన యాసరా  !           // అచ్చ తెలుగు //


    చరణం 2 :       అమ్మపాట మానవాళి జాతియ గీతం 
                         అమ్మమాట ఆవుపాల జలపాతం 

                         పాలతోటి మురిపాలు ఇదే అమ్మ స్తన్యం 
                         ప్రేమ కరుణ జాలి దయ ఇవే అమ్మ సైన్యం !

                         అమ్మంటే జన జీవన వేదంరా 
                         అమ్మంటే మరో ప్రణవ నాదంరా !           // అచ్చ తెలుగు //
       అమ్మకు నమస్కరిస్తూ.........                  
అయ్యో....... రామచంద్రా.....!!

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య వ్యాఖ్యలు, ప్రసంగాలు భలే కామెడి గా
అనిపిస్తున్నాయి. బాగా సీనియరే. అనుభవం పుష్కలంగా వున్నమనిషే. మరెందుకిలా
మాట్లాడుతున్నాడో అర్ధం కావటం లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి
పనిచేస్తున్నాడు. మంచో చెడో ఏదో తిప్పలు పడుతున్నాడు. అదే క్యాబినెట్ లో రామ
చంద్రయ్య ఒక మంత్రిగా వున్నాడు. అలాంటిది.... తెల్లారిలేస్తే " చిరంజీవి గొప్పవాడు ....
అలాంటి నాయకుడుగానీ, అంతటి చెరిష్మా వున్న నేత గానీ కాంగ్రెస్ లో లేడు  " అని
ఒకసారి, " చిరంజీవిని రాష్ట్ర ప్రజలు ఇంకా ఉన్నత పదవిలో చూడాలని అనుకుంటున్నారు " అని మరోసారి, " ముఖ్యమంత్రి కాదగ్గ అన్ని అర్హతలు చిరంజీవి లో వున్నాయి " అని ఇంకోసారి రోజుకో
రకంగా మాట్లాడుతున్నారు. మరో క్యాబినెట్ లో ఉంటూ ముఖ్యమంత్రి పై విమర్శల
వర్షం కురిపిస్తున్నారు. అంటే కిరణ్ కుమార్ వెంటనే పదవి లోనుంచి దిగి ఆ సీటు
చిరంజీవి కి ఇచ్చెయమనా రామచంద్రయ్య ఉద్దేశ్యం.. ఇది క్రమశిక్షణ అనిపించు
కుంటుందా.....?ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది రామచంద్రయ్య నిర్ణయిస్తారా ?
వాళ్లకు అధిష్టానం అంటూ ఒకటి వుంది కదా !ఎవరో సామాన్య కార్యకర్త మాట్లాడినట్టు
బాధ్యత గల మంత్రి మాట్లాడటం భావ్యమా ? ఎంత చిరంజీవి గారికి ఆనందం కలిగించాలనే
సంకల్పం వుంటే మాత్రం ఇలా తేలికగా మాట్లాడతారా ? ఏవిటో.... ఎవరు ఏం
మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో , ఎవరు మాట్లాడిస్తున్నారో పెరుమాళ్ళు
కెరుక.... అంతా విష్ణుమాయ !!   

9, మే 2013, గురువారం

ఇదెక్కడి విచిత్ర ధోరణి ?

ఇవాళ సుప్రీం కోర్టులో జగన్మోహనరెడ్డి గారికి బెయిల్ రాలేదు. జగన్ లాయర్ బెయిల్ 
ఇవ్వాలని. సి.బి.ఐ. వాళ్ళు బెయిల్ ఇవ్వవద్దని వాదించారు. ఇరువైపుల వాదనలు 
విన్నతరువాత బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. 
అంటే బెయిల్ రాలేదంటే ఇక్కడ సి.బి.ఐ. వాదన బలంగా వుందని, జగన్ తరపు
లాయర్ల వాదన బలహీనంగా ఉన్నదనీ ఎంతటి పామరుడికైనా ఇట్టే అర్ధమవుతుంది.
 అయితే జగన్ పార్టీ కి చెందిన కొందరు నాయకులు ఈ విషయాన్ని పక్కదారి పట్టిస్తూ
 వక్రభాష్యం చెబుతున్నారు. చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి 
విషయాల్లో రాజకీయపరంగా ఆలోచించి ఆ మైలేజి కోసం ఆరోపణలుచేయటం సరికాదు.
ప్రమాదకరం కూడా! తీర్పు కు ముందు  తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు మరి
కొంతమంది డిల్లీ లో కూర్చుని జగన్ కు బెయిల్ రాకుండా కుట్ర పన్నారని ఆరోపించటం
ఎంత తప్పు ? వాళ్ళుఆరోపణలు సంధిస్తోంది చంద్రబాబు పైన కాదు...... దేశ అత్యున్నత
న్యాయస్థానం పైన.... చంద్రబాబు లాంటివాళ్ళు సుప్రీం కోర్టు ను ప్రభావితం చేస్తారా ? 
ఇది సుప్రీం కోర్టు సార్వభౌమత్వాన్ని అధిక్షేపించటం కాదూ ...?ఎంత రాజకీయాలలో
వుంటే మాత్రం ఇంత బ్యాలెన్స్ తప్పి మాట్లాడతారా ? ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో ఒక్క
న్యాయ వ్యవస్థ మాత్రమే సజావుగా, సజీవంగా పని చేస్తోందని జనం నమ్ముతున్నారు ...
అది నిజం కూడా....జగన్ కు బెయిల్ రాకపోవటం ఆ పార్టీ వారికి బాధాకరమైన అంశమే
కావచ్చు. అయితే మాత్రం ఈ విచిత్ర ధోరణి ఏమిటి ? ఎక్కడికి పోతున్నాం మనం ?
ఒక్కసారి జగన్ పార్టీ వారితో బాటు అన్ని పార్టీల వారు ఆత్మపరిశీలన చేసుకోవలసిన
సమయం ఇది .... న్యాయస్థానాల నిజాయితిని ప్రశ్నించే దుస్సాహసం చేయద్దు...
అది రివర్స్ లో మనకే తగులుతుంది. తస్మాత్ జాగ్రత్త !!

7, మే 2013, మంగళవారం

జోహార్.... తారకరామా ...!

ఎలాగైతేనేం.... ఎట్టకేలకు పార్లమెంటులో రామారావు గారి విగ్రహం కొలువుతీరింది. అందరూ
హ్యాపీ.  ఒకళ్ళు పిలిచారని, మరొకళ్ళు పిలవలేదని రకరకాల వెర్షన్ల మధ్య రామారావు గారి
బొమ్మ దేశ అత్యున్నత చట్టసభా ప్రాంగణంలో నిలబడింది. చాలాకాలం తరువాత
తారకరాముడి కుటుంబం యావత్తునూ కళ్ళారా చూసాం. ఆనందం కలిగింది. ఫ్యామిలీ
ఫోటో లో చంద్రబాబు లేకపోవటం కొంచెం వెలితిగా అనిపించింది. ఈ విగ్రహ ప్రతిష్టాపన క్రెడిట్
తమదంటే తమదని అటు పురంధరేశ్వరి పోటిపడుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ
చేసిన కృషి అందరికీ తెలిసేలా జరిగింది. బాలయోగి గారి టైం నుంచి ఈ ప్రయత్నం
జరుగుతోంది. పురంధరేశ్వరి గారు నిశ్సబ్దంగా ప్రయత్నించారేమో తెలియదు.ఏదిఏమయినా
పని పూర్తయింది. లక్ష్మీపార్వతి గారు కూడా డిల్లీ వెళ్లి అందరితో కలివిడిగా తిరిగారుట.
దాదాపు అందరికి తాను రామారావు గారి సతీమణిని అని పరిచయం చేసుకున్నారట.
అదీ బానే వుంది.ఎక్కడో కృష్ణా జిల్లా నిమ్మకూరు లో పుట్టి నటుడిగా అంతర్జాతీయస్థాయికి
ఎదిగి రాజకీయాల్లోకి ఎంటరైన 9 నెలలకే ముఖ్యమంత్రి పదవినధిష్టించిన మహిమాన్వితుడు
తారకరాముడు. పార్లమెంటులో ఆయన విగ్రహం కొలువుతీరటం తెలుగు వారందరికీ
గర్వకారణం. ఇది మాత్రమే చాలదు. దేశ అత్యున్నత పురస్కారమయిన ' భారతరత్న '
పురస్కారం ఆయనకు ప్రకటించేలా రామారావు కుటుంబ సభ్యులు ప్రత్యేకించి పురంధరేశ్వరి
కృషి చేయాలి. అప్పుడే ఆయనకు మనం నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుంది.   

5, మే 2013, ఆదివారం

సామాన్యుడి పాదయాత్ర

రాష్ట్రంలో పాదయాత్రల హడావిడి జోరుగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు తన యాత్ర ఎట్టకేలకు ముగించారు. ముగింపు వేడుక కూడా భారీ ఎత్తున నిర్వహించి నభూతో నభవిష్యతి అన్న చందాన పూర్తి చేశారు. బానే ఉంది. పాపం... పెద్దాయన నానాయాతనలు పడి రాత్రింబవళ్ళు తిరిగి గొప్ప సింపతీ సంపాదించుకున్నారు. మన కోసం ఎన్ని కష్టాలు పడుతున్నాడ్రా... అని సామాన్య జనం అనుకునే రీతిలో తెగ తిరిగేశారు. ఏడు నెలల తర్వాత ఇంటికి చేరుకున్నారు. మరొపక్క బాబు యాత్ర మొదలయిన కొద్దిరోజుల తర్వాత హడావిడిగా ఆరంభమైన షర్మిలమ్మ పాదయాత్ర ఇంకా కొనసాగుతోంది.మధ్యలో పాపం కాలు ఇబ్బంది పెట్టడం వల్ల కొంతకాలం ఆగిన ఈ యాత్ర మళ్ళీ మొదలై జరుగుతోంది. జగన్మోహన్‌ రెడ్డి జైలులో ఉన్న కారణంగా ఏదో ఒక యాక్టివిటీ లేకపోతే క్యాడర్‌ లో నిరుత్సాహం పెరుగుతుందనే భయంతోనే ఈ యాత్ర చేస్తున్నారంటూ ఎగస్పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏదిఏమయినా షర్మిల మాత్రం పంటి బిగువున యాత్ర కంటిన్యూ చేస్తున్నారు. అదో టైపు. ఇంకో పక్క మన సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఏదో ఒక పేరు పెట్టుకుని నిత్యం ఏదో ఒక ప్రాంతం కవర్ చేస్తున్నారు.తెగ కష్టపడుతున్నాడు. బయట సంగతి సరే.. స్వంత పార్టీలోనే ఆయనకు మద్దతు లేదు. ప్రతిరోజూ కాంగ్రెస్ నాయకులే ఆయనను దారుణంగా విమర్శిస్తున్నారు. ఏమయినా మిగిలితే అపోజిషన్ పార్టీలు పంచుకుంటున్నాయి. అక్కడికీ ఆయన 'అమ్మహస్తం' అనో 'అభయ హస్తం' అనో 'ఇందిరమ్మ కలలు' అనో నానారకాల పేర్లు పెట్టుకుని ఊళ్ళు చుట్టేస్తున్నారు. ఇదో టైపు. ఇక నారాయణ, రాఘవులు సంగతి సరేసరి. పాదయాత్ర అనే పేరు లేకపోయినా వాళ్ళెప్పుడూ రోడ్ల మీదే ఏదో ఒక ఉద్యమం పేరుతో నడుస్తూనే ఉంటారు.వాళ్ళదో టైపు. మిగతా పార్టీల సంగతి సరేసరి... వీలు కుదిరినప్పుడల్లా కిలోమీటరో అర కిలోమీటరో పాదయాత్ర చేస్తూనే ఉంటారు. ఏతావాతా ఎవరి ఆశయాలు వారివి.. ఎవరి ఆలోచనలు వారివి.. ఎవరి రాజకీయ కోణం వారిది. వాటి గురించి విశ్లేషించేందుకు మనమెవరం? దాన్ని కాస్సేపు పక్కన పెడదాం.

 కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ పాదయాత్రల ఎపిసోడ్ పురాణకాలంలోనే మొదలయింది. అన్న రాముడి మీద దిగులుతో తల్లి పరంగా ఏర్పడిన చిన్న గిల్టీ ఫీలింగుతో భరతుడు శ్రీరామ చంద్రుడి పాదుకలు నెత్తిన పెట్టుకుని ఆ రోజుల్లోనే మైళ్ళ కొద్దీ తిరిగాట్ట. తండ్రికిచ్చిన మాట కోసం భార్య సీతను తీసుకుని లెక్కలేనన్ని కిలోమీటర్ల దూరం రాములవారు అరణ్యాల్లో బోల్డంత దూరం చుట్టేశాడు.మితిమీరిన
 ఆత్మవిశ్వాసంతో జూదమాడి అన్నీ కోల్పోయి భార్య, తమ్ముళ్ళతో కలిసి పన్నెండేళ్ళ పాటు అడవులు పట్టుకుని ధర్మరాజు ఫ్యామిలీ అప్పట్లోనే పాదయాత్రలు చేశారు. రాముడి ఆదేశం మేరకు జానకీ మాతను వెదికేందుకు బయల్దేరిన ఆంజనేయస్వామికి ఎగిరే సౌకర్యం ఉంది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఆయన కూడా పాదయాత్ర చేయక తప్పేది కాదు. భారతీయ సంస్కృతీ వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటేందుకు గానూ ముప్ఫయి రెండేళ్ళ వయసులోనే నాలుగుసార్లు భారత దేశం చుట్టి వచ్చిన జగద్గురువు ఆదిశంకరుడు ఆ రోజుల్లోనే పాద యాత్రల రికార్డు నెలకొల్పాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి.

పాదయాత్ర అంటే ఇంగ్లీష్‌లో వాకింగ్ అని అర్థం. గత దశాబ్ద కాలంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ అంతకు ముందు కంటే జనంలో బాగా పెరిగింది. తెల్లవారు ఝామునే లేచి బుల్లి నిక్కర్లు, చేతిలో కర్ర, షూస్ ధరించి కిలోమీటర్ల మేర నడిచేవారి సంఖ్య పెరిగిపోయింది. ఈ విషయంలో ఆడవారు కూడా ఏమీ తీసిపోలేదు. ప్రపంచ రాజకీయాలన్నీ ఈ కాసేపట్లోనే చర్చకొస్తాయి. ఆత్మస్తుతి, పరనింద ఈ గంటలో రాజ్యమేలుతాయి. ఆ వాకింగు కాస్తా పూర్తవగానే ఎవరిదారి వారిది.. మర్నాడుదయం దాకా ఎవడిగోలవాడిది... ఒక విధంగా ఈ వాకర్స్ కూడా పాద యాత్రికులే కదా..

బిడ్డకు రెండో సంవత్సరం వచ్చినప్పటి నుంచే వాళ్ళ స్కూళ్ళ సీట్ల కోసం డొనేషన్లు కట్టలేక తమ స్తోమతుకు తగ్గ విద్యా కర్మాగారాల కోసం తల్లిదండ్రులు కొన్నాళ్ళపాటు కాళ్ళరిగిపోయేలా తిరుగుతూనే ఉంటారు. అదీ ఒక రకంగా పాద యాత్రే కదా... గుండెల మీద ఉచిత గ్యాస్ స్టవ్ లాగా ఎదిగొచ్చిన ఆడపిల్ల పెళ్ళి కోసం ఎక్కే గడపా, దిగే గడపా రీతిలో కాళ్ళకు బలపం కట్టుకుని తిరిగే అమ్మాయిల తండ్రులు మ్యారేజి బ్యూరోల చుట్టూ పెళ్ళిళ్ళ పేరయ్యల ఇళ్ళ చుట్టూ తెగ తిరుగుతుంటారు.ఇదో టైపు పాదయాత్ర. 

ఖరీదైన కార్పొరేట్ స్కూళ్ళలో చేరేందుకు డబ్బుల్లేక, వెళ్ళేందుకు బస్సుల్లేని సర్కారీ బడుల్లోనే చేరి నిత్యం నాలుగైదు కిలోల బరువున్న పుస్తకాల గోతాన్ని భుజాన వేసుకొని పొద్దునా సాయంత్రమూ తిరిగే నిరుపేద విద్యార్థులది పాదయాత్ర కాదూ...! పెన్షన్ల కోసం గవర్నమెంటు ఆఫీసుల చుట్టూ రెండుపూటలా మూడువందల అరవై రోజులూ ఏదో మొక్కు తీర్చుకుంటున్నట్టు తెగతిరిగేసే లంచాలిచ్చుకోలేని రిటైర్డ్ ఉద్యోగుల పాదయాత్రల గురించి ఏం మాట్లాడ తాం చెప్పండి.

నిస్సిగ్గుకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన నాగరిక సమాజం సాక్షిగా ఈ రోజుకూ భుజాన బిందెలు మోసుకుంటూ గుక్కెడు మంచినీళ్ళకోసం కిలోమీటర్ల దూరం మండుటెండల్లో నడిచి వెళ్ళొచ్చే నా జాతి ఆడపడుచులది కన్నీటి పాదయాత్ర కాదూ..! ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని పాదయాత్రలు.. బతుకునీడ్చేందుకు నానా చావు చస్తున్న ఈ దేశ పౌరులు తమ నిత్య జీవన ప్రస్థానంలో వేసే ప్రతి అడుగూ పాద యాత్రకు నాంది ప్రస్తావనే.

అసలు పెళ్ళిళ్ళప్పుడు నూతన వధూవరులచేత ఏడడుగులు ఎందుకు వేయిస్తారో తెలుసా... ఇప్పటిదాకా ఎంత సుఖపడ్డారో తెలీదు కానీ, భవిష్యత్తు జీవన ప్రయాణంలో ఎన్నో లక్షల కిలోమీటర్లు బతకటం కోసం నడవాల్సి ఉంటుంది కాబట్టి అందుకు ప్రాక్టీసుగా ముందు ఓ ఏడడగులు వేయండీ అని.. ఈ ఏడడగుల పాదయాత్రకు మరో అర్థం కూడా అన్వయించుకోవచ్చు...

మొదటి అడుగు జీవితంలో స్థిరపడేందుకు. రెండో అడుగు సంతానాన్ని స్థిరపరచేందుకు.. మూడో అడుగు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేందుకు... ఎదిగొచ్చిన కొడుకు గుండెల మీద తన్ని పెళ్ళాంతో లేచిపోతే దాన్ని తట్టుకుని నిలదొక్కుకునేందుకు నాలుగో అడుగు.. కడుపున పుట్టిన బిడ్డలు ఎంచక్కా ఆస్తులు పంచేసుకుని తమను వదిలి వెళ్ళిపోతే అడుగులు తడబడే వయసులో వృద్ధాశ్రమాల వైపు నడిచేందుకు అభ్యాసంగా అయిదో అడుగు..భర్తను వదిలి భార్యో, భార్యను వదిలి భర్తో ముందుగా కన్నుమూస్తే ఆ ఎడబాటును తట్టుకుని ఒంటరితనం వైపు పయనించేందుకు ప్రాక్టీసుగా ఉండటం కోసం ఆరో అడుగు.. మమతానుబంధాలను తెంచుకుని ఊపిరి గాల్లో కలిపిసోతే రుద్రభూమి వైపు పార్థివ దేహాల మహాయాత్రకు గురుతుగా ఏడో అడుగు... ఇది పక్కన పెడితే జీవితంలో ఆచితూచి అడుగేయండి అంటారు మన పెద్దవాళ్ళు... ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా మన జీవన ఘన పాదయాత్రల్లో కాళ్ళు వణుకుతాయని.. బెణుకుతాయని.. కాబోలు..!

4, మే 2013, శనివారం

దాడి మాస్టారూ.... ఎందుకిలా...??

  తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు రెండ్రోజుల క్రితం స్వంత పార్టీ కి రాజీనామా
  చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాకపోవచ్చు.
  ప్రజాస్వామ్యంలో ఎవరిష్టం వారిది. అయితే దాడి విషయంలో ఈ సూత్రాన్ని అన్వయించుకోలేక
  పోతున్నాం. కేవలం తనకు పదవి ఇవ్వలేదన్న బాధతో గత 30 ఏళ్ల పాటు వున్న అనుబంధాన్ని
  త్రుణప్రాయంగా తెంచేసుకుని గోడ దూకేశారు. తనకు పదవులు ముఖ్యం కాదంటూ గోడ దూకే
  చివరి నిముషంలో ఓ కార్టూన్ వేసారు. నవ్వాలో ఏడవాలో తెలియదు. పదవి ఇవ్వనందుకే
  మనస్తాపం చెందానంటూ ఒక పక్క చెబుతూ ఈ స్టేట్ మెంట్ ఏమిటో నా మట్టి బుర్రకు అర్ధం
  అయి చావటంలేదు. అదలా పక్కన పెడదాం. పదవీ సౌఖ్యం పట్ల ఆసక్తి లేదు అని దాడి మాస్టారు
  సెలవిచ్చారు. అలాంటప్పుడు ఎప్పుడు బాధ కలిగితే అప్పుడు తెలుగుదేశం నుంచి బైటికి రాకుండా
  తన పదవీ కాలం చివరి క్షణం పూర్తయిందాకా బలుపుకారు సౌఖ్యాన్ని, క్యాబినెట్ హోదాను
  అనుభవించి ఆ టైం పూర్తయిన మరుక్షణమే పార్టీ కి రాజీనామా చేయటం కామెడీ గా వుంది.
  దాన్నీ కాసేపు ఫ్రిజ్ లో పెడదాం. ఎకాఎకిని చంచలగూడ జైలులో నివసిస్తున్న జగన్ గారి
  దగ్గరకు వెళ్లి పోయి ఆయనను చూడగానే దిగ్భ్రాంతికి గురయ్యారట. ఇంతటి శక్తి వంతుడికా
  ఇన్నాళ్ళూ తాను దూరంగా వున్నది .....? ఇంతటి మహా నాయకుడినా ఇన్నాళ్ళూ తాను
  విమర్శించింది....? రాష్ట్రానికి ఒక దారి చూపగల ఇంతటి మహిమాన్వితుడికా తాను ఇంతకాలం
  పాటు ద్రోహం చేసింది....? అంటూ తనలో తనే కుమిలిపోయి కంటికీ మంటికీ ఏకధారగా
  వస్తున్న ఆవేదనను పంటి బిగువున తోక్కిపెడుతూ అల్లాడిపోయాడు దాడి మాస్టారు. పైగా
  ఇన్నేళ్ళపాటు వై ఎస్ కుటుంబంపై తాను ఎన్నో విమర్శలు, ఆరోపణలు చేసానని, కౌన్సిల్ లో
  తూర్పారబట్టానని, అయితే అవి తన వ్యక్తిగత అభిప్రాయాలు కావని, పార్టీ ప్రతినిధిగా అలా
  మాట్లాడానని ఒక కొత్త విషయాన్ని మీడియా ముందు వ్యక్తం చేసారు. పార్టీ ఎలా చెబితే అలా
  చిలకలా మాట్లాడటానికి అయన పార్టీ ఎంప్లాయి కాదు.... నాయకుడు. చంద్రబాబు కన్నా పై
  స్థానంలో వున్న నాయకుడు. తాను వ్యక్తిత్వం లేని నాయకుడినని, కేవలం పార్టీ ప్రతినిధిని
  మాత్రమేనని తన గురించి తాను దాడి స్పష్టంగా చెప్పారు. బావుంది....ఆయన నిజాయితీ
  నాకు నచ్చింది. ఒక పవిత్రమైన ఉపాధ్యాయవృత్తి నుంచి వచ్చి రాజకీయాలను ఇలా
  చౌకబారుగా నిర్వహించటం దాడి లాంటి వారికి తగునా అన్న ప్రశ్నకే సమాధానం దొరికి
  చావటం లేదు..... ఆయనకు ఇప్పుడు ఇలాంటి అభిప్రాయాలు, ఆలోచనలు బుర్రకెక్కవు.
  ప్రస్తుతం దాడి మాస్టారు పదవీ లోకంలో జగన్మాయలో విహరిస్తున్నారు. పాపం...
  వాళ్ళబ్బాయిని చూస్తుంటే జాలేస్తోంది. పితృవాక్య పాలన కోసం తన కెరీర్ ను....... ఏమో!!
 3, మే 2013, శుక్రవారం

ఇంతటి పైశాచికమా ?


  సరబ్ జిత్ మృతి బాధ కలిగించింది. ఏదో ఒకటి జరిగి అతడు బతికితే బావుణ్ణు అని అందరూ
  అనుకుంటూండగానే  సరబ్ కన్నుమూశాడు. కుటుంబ సభ్యులు గుండెలు పగిలేట్టు విలపించారు.
  దేశం యావత్తూ కోరుకుంది. అయినా ఫలితం లేకపోయింది. పాకిస్తాన్ మూర్ఖత్వం, మొండితనం,
  రాక్షత్వం సాక్షిగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఒక ప్రాణాన్నే లెక్క చేయని ఆ దేశం ఆ ప్రాణాన్నీ
  కాపాడటం కోసం చిత్తశుద్ధి తో ప్రయత్నం చేస్తుందనుకోవటం అమాయకత్వం, అవివేకం కూడా.
  ఆ నిర్లక్ష్యమే సరబ్ ప్రాణాలు బలిగొంది. తోటి ఖైదీల దాడిలో గాయపడ్డ అతడిని వెంటనే భారత్
  తరలించి వుంటే బతికేవాడేమో. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ అలసత్వం కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
  ప్రభుత్వం మరింత తీవ్రంగా ప్రయత్నం చేసి వుంటే సరబ్ భారత్ కు వచ్చేవాడేమో....
  బతికేవాడేమో....మృతదేహం భారత్ కు వచ్చినతరువాత సోనియా గాంధి, రాహుల్ గాంధి లు
  ఎంతమంది పరామర్సించినా ఫలితం ఏముంటుంది.... ప్రాణం గాలిలో కలిసిపోయింది.... పైగా
  పాశవికం ఏమిటంటే సరబ్ మృతదేహాన్ని ఇండియా కు పంపుతూ అతడి గుండె, కిడ్నీ లాంటివి
  తీసేసి పంపారట. పాకిస్తాన్ ది ఎంతటి పాశవికం. ఎంతటి రాక్షసత్వం. అసలు మనుషులేనా ?
  మానవత్వమనేది లేదా..... ఈ పాపానికి కారకులెవరు ? ఈ ఘాతుకానికి కారణమెవరు ?
  గుండెలవిసి పోయేట్టు అల్లాడిపోతున్న సరబ్ కుటుంబ సభ్యులను ఓదార్చేదెవరు?
   ఇంతటి పైశాచికమా ?