తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు రెండ్రోజుల క్రితం స్వంత పార్టీ కి రాజీనామా
చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాకపోవచ్చు.
ప్రజాస్వామ్యంలో ఎవరిష్టం వారిది. అయితే దాడి విషయంలో ఈ సూత్రాన్ని అన్వయించుకోలేక
పోతున్నాం. కేవలం తనకు పదవి ఇవ్వలేదన్న బాధతో గత 30 ఏళ్ల పాటు వున్న అనుబంధాన్ని
త్రుణప్రాయంగా తెంచేసుకుని గోడ దూకేశారు. తనకు పదవులు ముఖ్యం కాదంటూ గోడ దూకే
చివరి నిముషంలో ఓ కార్టూన్ వేసారు. నవ్వాలో ఏడవాలో తెలియదు. పదవి ఇవ్వనందుకే
మనస్తాపం చెందానంటూ ఒక పక్క చెబుతూ ఈ స్టేట్ మెంట్ ఏమిటో నా మట్టి బుర్రకు అర్ధం
అయి చావటంలేదు. అదలా పక్కన పెడదాం. పదవీ సౌఖ్యం పట్ల ఆసక్తి లేదు అని దాడి మాస్టారు
సెలవిచ్చారు. అలాంటప్పుడు ఎప్పుడు బాధ కలిగితే అప్పుడు తెలుగుదేశం నుంచి బైటికి రాకుండా
తన పదవీ కాలం చివరి క్షణం పూర్తయిందాకా బలుపుకారు సౌఖ్యాన్ని, క్యాబినెట్ హోదాను
అనుభవించి ఆ టైం పూర్తయిన మరుక్షణమే పార్టీ కి రాజీనామా చేయటం కామెడీ గా వుంది.
దాన్నీ కాసేపు ఫ్రిజ్ లో పెడదాం. ఎకాఎకిని చంచలగూడ జైలులో నివసిస్తున్న జగన్ గారి
దగ్గరకు వెళ్లి పోయి ఆయనను చూడగానే దిగ్భ్రాంతికి గురయ్యారట. ఇంతటి శక్తి వంతుడికా
ఇన్నాళ్ళూ తాను దూరంగా వున్నది .....? ఇంతటి మహా నాయకుడినా ఇన్నాళ్ళూ తాను
విమర్శించింది....? రాష్ట్రానికి ఒక దారి చూపగల ఇంతటి మహిమాన్వితుడికా తాను ఇంతకాలం
పాటు ద్రోహం చేసింది....? అంటూ తనలో తనే కుమిలిపోయి కంటికీ మంటికీ ఏకధారగా
వస్తున్న ఆవేదనను పంటి బిగువున తోక్కిపెడుతూ అల్లాడిపోయాడు దాడి మాస్టారు. పైగా
ఇన్నేళ్ళపాటు వై ఎస్ కుటుంబంపై తాను ఎన్నో విమర్శలు, ఆరోపణలు చేసానని, కౌన్సిల్ లో
తూర్పారబట్టానని, అయితే అవి తన వ్యక్తిగత అభిప్రాయాలు కావని, పార్టీ ప్రతినిధిగా అలా
మాట్లాడానని ఒక కొత్త విషయాన్ని మీడియా ముందు వ్యక్తం చేసారు. పార్టీ ఎలా చెబితే అలా
చిలకలా మాట్లాడటానికి అయన పార్టీ ఎంప్లాయి కాదు.... నాయకుడు. చంద్రబాబు కన్నా పై
స్థానంలో వున్న నాయకుడు. తాను వ్యక్తిత్వం లేని నాయకుడినని, కేవలం పార్టీ ప్రతినిధిని
మాత్రమేనని తన గురించి తాను దాడి స్పష్టంగా చెప్పారు. బావుంది....ఆయన నిజాయితీ
నాకు నచ్చింది. ఒక పవిత్రమైన ఉపాధ్యాయవృత్తి నుంచి వచ్చి రాజకీయాలను ఇలా
చౌకబారుగా నిర్వహించటం దాడి లాంటి వారికి తగునా అన్న ప్రశ్నకే సమాధానం దొరికి
చావటం లేదు..... ఆయనకు ఇప్పుడు ఇలాంటి అభిప్రాయాలు, ఆలోచనలు బుర్రకెక్కవు.
ప్రస్తుతం దాడి మాస్టారు పదవీ లోకంలో జగన్మాయలో విహరిస్తున్నారు. పాపం...
వాళ్ళబ్బాయిని చూస్తుంటే జాలేస్తోంది. పితృవాక్య పాలన కోసం తన కెరీర్ ను....... ఏమో!!