7, మార్చి 2012, బుధవారం

నారాయణ...నారాయణా....!!!



         సి పీ ఐ నారాయణ గారంటే నాకు చాలా గౌరవం. నాకు ఇష్టమైన నాయకుడు కుడా. ఆయన మెయింటైన్ చేసే
 రాజకీయ పద్ధతులు కొన్ని ముచ్చటగా వుంటాయి. ఆయన స్టేట్ మెంట్లు కుడా చాలా హుందాగా, విభిన్నంగా, ఆలోచనాత్మకంగా వుంటాయి. నాకు మంచి మిత్రుడు కుడా... అయితే ఇటివలి కాలంలో ఆయన వ్యాఖ్యానాలు, ఆయన చేస్తున్న కామెంట్లు ఆయన స్థాయికి తగ్గట్టుగా లేవు. ఆయన వ్యక్తిత్వం కూడా అది కాదు. ఆయన ఏమి చేసినా అది ఒక
వార్త....అదో సంచలనం.... ఒక రాజకీయ నాయకుడు చికెన్ తినటం కూడా కొంతకాలం పాటు మీడియా లో రాజ్యమేలింది అంటే ' అదీ నారాయణ అంటే..' అనుకున్నారు అందరూ... ఇక సైకిళ్ళు తోక్కటాలు, మోటారు సైకిళ్ళు నడపతాలు   లాంటివి చెప్పనే అక్ఖర్లేదు...ప్రతిదీ వార్తే....అవన్నీ పక్కన పెడితే....ఈ మధ్య కాలంలో నారాయణ గారు కొంచెం గాడి తప్పారా అనిపిస్తోంది...ఐ ఎ ఎస్ అధికారిణి  శ్రీ లక్ష్మి  గురించి గాని, అసెంబ్లీ ని పందుల దొడ్డి తో పోల్చటం గాని, నిన్నా మొన్నట్లో మంత్రి గీతా రెడ్డి గారి గురించి గాని, ఆయన చేసిన కామెంట్లు చాలా దారుణంగా వున్నాయి. నారాయణ ఇలా మాట్లాడుతున్నారేవిటి అని పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరూ అసహ్యించుకుంటున్నారు. ఇంత పెద్ద మనిషి ఇలా ప్రవర్తిస్తున్నారు ఏమిటి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
నానా మాటలు మాట్లాడటం తరువాత నాలిక కరుచుకోవటం నారాయణకు మ్యానరిజం గా మారిపోయింది.
ఈ రోజు ఆయన గీతా రెడ్డి గారికి రాసిన క్షమాపణ లేఖ చూస్తే నారాయణ లాంటి నాయకుడికి ఇలాంటి పరిస్థితి అవసరమా అన్న ప్రశ్న ఎవరిలోనయినా  ఉత్పన్నం కాక మానదు. ఇది స్వయంక్రుతం... ఆయన పరిస్థితికి ఆయనే కారకుడు... ఒక జాతీయ పార్టికి మన రాష్ట్రంలో ప్రతినిధిగా వున్న నారాయణ లాంటి నాయకుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే కాదు... ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణా ఉప ఎన్నికలలో టి ఆర్ ఎస్ కు మద్దతు ఇస్తూ సి పీ ఐ నిర్ణయం తీసుకుంది. అంతవరకు బానే వుంది. అది ఆ పార్టి ఇష్టం. కాని మర్నాడే కే సి ఆర్ లాంటి వాణ్ని నమ్ముకుని భవిష్యత్తులో ఎలా ప్రయాణం చేయగలం అంటూ మాట్లాడటం ఆయన మానసిక పరిస్థితిని ప్రశ్నిస్తోంది. పైగా పార్టి బతకాలిగా అంటూ మాట్లాడటం చూస్తుంటే తన పార్టిని తనే చులకన చేసుకుంటున్నారా అనిపిస్తోంది. ఏది ఏమయినా ' అంతా బావుంటావు...అర్ధం కావు నారాయణా....' అన్నట్టు తయారైంది ప్రస్తుత పరిస్థితి. నారాయణ గారు...ఆలోచించండి సర్....కొన్ని మార్చుకోండి...!!!!





   





1 కామెంట్‌: