26, ఫిబ్రవరి 2011, శనివారం

రమణ గారూ...ఏంటి సార్....ఇలా చేసారు..?

           పరికిణి కట్టి, వోణి వేసుకుని, రెండుజడలు, చెవులకు కమ్మలు, కాళ్ళకు గజ్జెలు, తల వెనక జడ బిళ్ళ ,కళ్ళకు కాటుక, నుదుటన బొట్టు, చేతులకు అరవంకిలు, ముఖం పైన పాపటి బిళ్ళ అలంకరించుకుని నాన్న వస్తాడని ఇంటి బయటే ఎదురు చూస్తున్న రెండు జెళ్ళ సీత తండ్రి ఇకరాడని తెలిసి గుండెలు పగిలేలా ఏడుస్తోంది.. నిక్కరేసుకుని వాణ్ని వీన్ని చెడా మడా తిట్టేసి అలసి పోయిన బుడుగు గాడు నాన్న ఇక లేరన్న  వార్త విని సొమ్మసిల్లి పడిపోయాడు..బామ్మ నెత్తి నోరు కొట్టుకుని రోదిస్తోంది...సీగేన పెసూనాంబ అయితే ఎవరితోనూ మాట్లాడటం లేదు...కాంట్రాక్టార్ తన సహజ సిద్ధమైన విలని మర్చిపోయి ఘోల్లుమంటున్నాడు...తుత్తి గోపాల కృష్ణకు అసలు మాటలే రావటం లేదు...వీళ్ల అందరి వేదనకు కారణం ఒక్కటే...తమకు జన్మనిచ్చిన  అమ్మ....తమను సృష్టించిన బ్రహ్మ... ముళ్ళపూడి వెంకట రమణ అనే సాహితీ సోమయాజి...అక్షర ఘనాపాటి....తమను వదిలి వెళ్లి పోయాడనే వార్త వినటం....అయిన వాళ్ళు పోయారని తెలిస్తే బాధకలగటం ఎవరికైనా సహజం...కాని ఇక్కడ అయిన వాడు మాత్రమే కాదు...అన్నీ తానయిన వాడు.... అంతా తనే అయినవాడు దూరం కావటం...బుడుగుకు నిక్కరేసుకోటం దగ్గర్నించి తుత్తి గోపాలకృష్ణకు సూట్ వేసుకోటం దాకా నేర్పిన రమణ గారు పై లోకాల్లో ఎవరికో ఏదో నేర్పేందుకు వెళ్ళిపోయారు...వెండితెరపై తెలుగు నేటివిటితో గోరంత దీపాలు పెట్టిన ఆ సాక్షర జ్యోతి కొడిగట్టి పోయింది...స్వర్గంలో నవ్వుకు అంత దరిద్రం ఏర్పడిందేమో రమణ గారిని తీసుకెళ్ళి పోయారు...తమ జన్మకు ఒక పరమార్ధం చెప్పిన అక్షర క్షేత్ర 'పాళి'కుడు రమణ తమకు ఇక లేరన్న బాధతో దేశంలోని  సిరా బాటిళ్ళు , రిఫిళ్ళ కంపెనీలు సమ్మె చేస్తున్నాయి...రమణ అక్షరాన్ని తాకి పునీతమైన తెల్ల కాగితాలు ఆ అక్షర స్పర్శకు దూరమయి పోయామన్న క్షోభతో నల్లబడ్డాయి...తెలుగు సున్నిత సాహితీ ప్రపంచం తనకు తాను అత్యవసర పరిస్థితిని ప్రకటించుకుంది....ఇక దాగుడు మూతలు ఉండవు...రక్త సంబందాల్లేవు...అందాలరాముళ్ళు కనపడరు... బుద్ధిమంతుళ్ళ చిరునామాలు దొరకవు...పెళ్లి పుస్తకాలు తెరుచుకోవు...గుడి గంటలు వినపడవు...ఎంతటి దారుణం...ఎంతటి విషాదం...ఎంతటి కష్టం...రమణగారు జీవితంలో మొట్టమొదటి సారిగా తప్పు చేసారు...ఎవరికీ చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయారు....మా అందరి సంగతి సరే...అరవై ఏళ్ళ స్నేహ సాహచర్యం చేసిన మిత్రుడు బాపు గారికి కుడా చెప్పకుండా... ఆయన్ను కూడా వదిలేసి వెళ్ళటం ఎంతవరకు సమంజసం ? బాపు గారి వాడే కుంచె నుంచి బైటికొచ్చేరంగులు ముళ్ళపూడి కంపెనీలో తయారవుతాయి...రమణ గారి కలం నుంచి జాలువారే సిరా చుక్కలు బాపు గారి మస్తిష్కంలో పురుడు పోసుకుంటాయి....రమణ ఇంటి పేరు బాపు...బాపు అసలు పేరు రమణ....ఈ లౌకిక ప్రపంచం నుంచి తను నిష్క్రమించటం వల్ల ఇంతమంది ఇంతగా బాధ పడతారని బహుశా రమణ గారు కుడా ఊహించి వుండరేమో....ఊహించి వుంటే తన నిర్ణయం మార్చుకుని కనీసం మరో పాతికేళ్ళు మనతోనే వుండేవాళ్ళు.... బాపురమణ అనే ఇద్దరు వ్యక్తుల ఒక్క పేరు రెండుగా విడిపోవటం తెలుగువాళ్ళు ఎవరూ తట్టుకోలేరు....అందుకే తెలుగువాళ్ళందరికీ ఆ బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడు. అందం వున్నంతకాలం బాపు గారి పేరు...అక్షరం ఉన్నంత కాలం రమణ గారి పేరు....స్నేహం ఉన్నంత కాలం బాపురమణల పేర్లు నిలిచి పోతాయి....భూమ్యాకాశాలు కలుసుకోనంత కాలం బాపురమణల పేర్లు ఎవరూ విడదీయలెరు......ఇది బ్రహ్మ వరం....!!! 


8 కామెంట్‌లు:

 1. దే'ముళ్ళ పూడి'కలు , కూడికలు , తవ్వకాలు , తీసివేతలు..మన ఆవేదనల ' బాపు ' నని..ఏనాడూ అనుకోలేదు కానీ..వెంకట రమణుడు కూడా ఇలా చేస్తాడని...కొత్తవేదన కలుగజేస్తాడని.తెలిస్తే కోతికొమ్మచ్చులు మాని కూసింత కలాపోసన నేర్చుకునే వాణ్ణి.

  .బాపు గారి గుండెలో నిండిన చీకటిని తరమడానికి కొండంత దీపము ఇప్పుడవసరము.

  .రాముడేమన్నాడో...పుణ్యమొక్కటే మిగులునన్నాడా ? మిగిలి ? ఏం చేసుకోను ? శ్రీ రామ రాజ్యం వస్తే కానీ ఆయన ఏం చెప్పాడో తెలియదు...
  ( సర్ , దయచేసి బ్యాక్ గ్రౌండ్ కలరు మార్చగలరా ? ఇప్పుడు చదవడం కష్టం గా వుంది.).

  రిప్లయితొలగించు
 2. we miss Ramana garu very much,Article was really Awesome meru illanti goppa articles enno rayalani manaspurthiga korukuntunnamu...

  రిప్లయితొలగించు
 3. చాలా "చిక్కని" మాటల్తో రమణ-బాపు గారి స్నేహానికి "నిండైన తెలుగుదనం" పొందికగా ఇచ్చారు.

  రిప్లయితొలగించు
 4. అందం వున్నంతకాలం బాపు గారి పేరు...
  అక్షరం ఉన్నంత కాలం రమణ గారి పేరు....
  స్నేహం ఉన్నంత కాలం బాపురమణల పేర్లు నిలిచి పోతాయి....
  "
  నిజం సార్.
  రమణ గారికి శ్రద్దాంజలి
  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

  రిప్లయితొలగించు
 5. I could not believe that Mr.Ramana garu is not among us, it is indeed a sad moment for all of us, your article is very good. actually i was waiting for a movie from both bapu and ramana, but... at least i request bapu garu to make a movie if he has any of the stories which they would have discussed, i promise we will make it a hit movie which can be a fitting tribute to the legend ramana garu.

  రిప్లయితొలగించు
 6. //రమణ ఇంటి పేరు బాపు...బాపు అసలు పేరు రమణ//


  బాగా చెప్పారు . కోతికొమ్మచ్చి చదివి గత౦ తలుచుకొని మదనపడని పెద్దలు ఉ౦డరు,ఆ కాలపు ఆప్యాయతలు,విలువలు తెలుసుకొని మనసు పడని మాలా౦టి ఈ తర౦వాళ్ళు ఉ౦డరు. కోతికొమ్మచ్చి ఇ౦కా ఆడే౦దుకు రమ్మణ్ణ’దా౦ అని ఆశ .

  రిప్లయితొలగించు
 7. రమణ ఇంటి పేరు బాపు... బాపు అసలు పేరు రమణ...
  చాలా బాగా చెప్పారు ఏవీఎస్ గారూ..

  రిప్లయితొలగించు