14, ఆగస్టు 2010, శనివారం

మేరా భారత్ మహాన్...

మళ్ళీ స్వతంత్రం పండగొచ్చింది . మామూలుగానే గవర్నమెంటు సెలవు . జెండాలు ఎగరేస్తాం . చాక్లెట్లు  గట్రా పంచుతాం . హాలిడే కాబట్టి మల్టీప్లెక్సులన్నీ కుర్రాళ్ళు ,ఫ్యామిలీలతో ఫుల్లయిపోతాయి . ముఖ్యమంత్రి గారేమో హైదరాబాదులోనూ , మన్మోహన్ గారేమో ఢిల్లీలోనూ మూడురంగుల జెండాలెగరేసి జాతినుద్దేశించి  ప్రసంగిస్తారు . అన్ని రాజకీయ పార్టీల ఆఫీసుల్లోనూ ,సర్కారు ఆఫీసుల్లోనూ , కొన్ని రహదార్ల చౌరాస్తాల్లోనూ జెండాలెగరేసి జనగణమన పాట ఎంతవరకు వస్తే అంతవరకు  పాడి దేశానికి బోల్డంత సేవచేశామనుకొని ఇళ్ళకు వెళ్ళటం మామూలే . పత్రికలు ఈ ఒక్క రోజు తమ లోగోలను , టీవీ చానెళ్ళ వాళ్ళూ తమ ఎంబ్లెంలను మువ్వన్నేలతో నింపటం కూడా సాధారణం . అన్నీ బానే ఉన్నాయి . కానీ ......
                                                 ఏదో మొక్కుబడిగా జరిగే ఈ ప్రహసనంలో ఏదో తెలియని అవాస్తవం .... అస్పష్టత ... అన్ నాచురాలిటీ... ఆత్మవంచన... ఆగస్టు పదిహేను వస్తేనే స్వతంత్రదినం గుర్తొచ్చే మనలో  ఎంతమందికి జెండా ఎందుకు ఎగరేస్తున్నమో తెలుసో చెప్పండీ . అసలు స్వతంత్రం ఎందుకొచ్చిందో  , ఎలా వచ్చిందో తెలియక చాక్లెట్లు తింటున్న పిల్లలకూ ..... వాళ్ళకు ఎందుకు స్వీట్లు పంచుతున్నామో తెలియచెప్పాలన్న ఆలోచన లేని పెద్దవాళ్ళకూ .., తనెందుకు ఎగురుతున్నానో తెలియని జెండా తల్లి ఏమని చెప్తుంది  చెప్పండి . స్వతంత్రం పండగరోజు ఆ వేడుకలను చూడటానికి వచ్చే వాళ్ళు హ్యాండుబ్యాగులు , టిఫిన్ బాక్సులు తీసుకురావద్దంటూ ఓ పోలీసు అధికారి ఆదేశించాడంటే మనం ఎంత బిక్కు బిక్కు మంటూ స్వతంత్ర వేడుకలను జరుపుకొవలసిన ఖర్మ ఈ దేశానికి ఎందుకు పట్టిందన్న ప్రశ్నకు దివంగతులైన ఏ సమరయోధుడి ఆత్మ సమాధానం చెబుతుంది చెప్పండి . మూడురంగుల జేండాలో కాషాయం పైన వుంటుందో గ్రీన్ కలర్ పైవైపుంటుందో ఈ దేశంలో చాలామంది రాజకీయనాయకులకు తెలియదంటే ఆశ్చర్యపడదామా ? సిగ్గుపడదామా ? ఇలా తలచుకుంటూ ... తవ్వుకుంటూ పోతే ఎన్నో గుర్తొస్తున్నాయి ... కలచివేస్తున్నాయి ... అన్నీ దిగమింగుదాం ... అన్నీ జీర్ణించుకుందాం... ఇదీ తల్లీ భారతి దురదృష్టం అని సరిపెట్టుకుందాం ... ఎంచక్కా జెండా ఎగరేద్దాం... అన్నీ అబర్ధాలని తెలిసికూడా రాజకీయ నాయకుల ఉత్తేజపూరిత ఉపన్యాసాలు విని చప్పట్లుకొట్టి  ఇంటికి వచ్చి సాయంకాలం ఫ్యామిలీతో ఏ మల్టీప్లెక్స్ కో వెళదాం ... పిచ్చి జెండా ... గాలివున్నంతసేపు ఎగురుతుంది...  ఎగరనివ్వండి... మనం పట్టించుకోక పోయినంతమాత్రాన మహాత్మాగాంధీ గారో ... వావిలాల గోపాలకృష్ణయ్య గారో వచ్చి మనల్ని అడగరు కదా ... ఎంజాయ్ ...
                                                             మేరా భారత్ మహాన్...           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి