15, సెప్టెంబర్ 2010, బుధవారం

ఫ్యాన్సో రక్షతి రక్షితః ..........!

ఇది ఎవరినో నిందించటం గాని, విమర్శించటం గానీ కాదు. ఎవరినో నొప్పించాలన్న ఉద్దేశ్యం కూడా నాకు లేదు. ఒక సినిమా వాడిగా నా స్పందనను నా బ్లాగ్లో రాసుకోవాలనిపించింది. రాస్తున్నా. ఒక పెద్ద హీరోతో సినిమా చేస్తున్నప్పుడు ఆ  దర్శకుడు ఎంత జాగ్రత్తగా, బాధ్యతగా , ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎంత వళ్ళుదగ్గర పెట్టుకుని ఉండాలో ఇటీవలి పెద్ద సినిమాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. పరిస్తితిని చెప్పకనే చెబుతున్నాయి. ఒక పెద్ద హిరో సినిమా వస్తోందంటే ఆ సినిమా నిర్మాతలు,డిస్త్రిబ్యుటర్లు, థియేటర్ల వాళ్ళు ఆర్టిస్టులు,టెక్నిషియన్లు ఎన్ని ఆశలు పెట్టుకుంటారో, ఎంతమంది జీవితాలు ఆధార పడిఉంటాయో తెలియనిదికాదు. వీటి గురించి నేను ప్రస్తావించబోవటంలేదు.పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఆ రేంజిలో వీళ్ళంతా నష్టపోతారు. కాని నేను చూస్తున్న కోణం అభిమానుల  వైపు నుంచి... తమ అభిమాన హిరో సినిమా ఎప్పుడొస్తుందా అంటూ వేయి కళ్ళతో ఎదురుచుస్తూ గడిపే అభిమానులు మొదటిరోజునే ఆ సినిమా చూడాలని ఎంతగా ఎదురుచూస్తారొ అందరికీ తెలుసు. తమ హీరోని ఎవరయినా ఏమయినా అంటే భరించలేరు.వాళ్ళతో కొట్లాడతారు. గొడవలు పెట్టుకుంటారు. సినిమా రిలీజుకు కొన్ని రోజులు ముందు నుంచి నిద్రపోరు...సరిగ్గా అన్నం తినరు. సినిమా గురించి ఎంతగానో ఉహించుకుని ఆకాశంలో తేలియాడుతుంటారు. రిలీజు రోజున పూజలు చేస్తారు.అన్నదానం చేస్తారు. ఇందుకోసం ఇంట్లో వస్తువులు అమ్మేస్తారు.అమ్మా నాన్నలకు తెలియకుండా దొంగతనం చేస్తారు. కుర్రాళ్ళు సెల్ ఫోన్లు అమ్మేస్తారు. మోటారు సైకిళ్ళు తాకట్టు పెడతారు. రిలీజు రోజున పదకొండు గంటలకు మొదటిఆట అయితే తెల్లవార కుండానే క్యూల్లో నించుంటారు. బయట కటవుట్లు,బ్యానర్లు,పూలదండలు, బాణ సంచా ఇలా ఎన్నో తమ హిరో మీద పిచ్చి అభిమానంతో ఖర్చు పెడతారు. తాము ఎన్నో రకాలుగా ఊహించుకున్న సినిమా ఊహించని విధంగా నిరాశపరచటంతో వాళ్ళు పడే బాధ వర్ణనాతీతమ్. బహుశా కోటానుకోట్లు నష్టపోయిన నిర్మాత కూడా ఇంతగా బాధకు గురికాడేమో. ఎవరో తమ సొంత మనిషి పోయినట్లు తమలో తామే కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు. ఎవరినీ ఏమీ అనలేరు. కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకునేందుకు కూడా సిద్దపడతారు. చేసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు.ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒక పెద్ద హీరోతో సినిమా తీస్తున్నామన్టె ఆ దర్శకుడు మిగిలిన వారికి జరిగే నష్టంతో బాటు అభిమానుల మానసిక క్షోభగూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏళ్లతరబడి సినిమాలు తీసి ఫ్లాపులు ఇస్తున్న కొందరు దర్శకులు సినిమాను ఆషామాషిగా కాకుండా మరింత  బాధ్యతగా తీసుకోవా లనేది నా అభిప్రాయం. ఎప్పుడో పరాయి భాషల నుంచి వచ్చి ఏదో సరదాగా సినిమాలు తీసి హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వెళ్లి పోయే కొందరు దర్శకులు ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవాలి. అది ఏ భాష అయినా కావచ్చు. ఏ దర్సకుడయినా కావచ్చు. ఒక పెద్ద హిరో సినిమా ఫలితం ఆ నిర్మాత మీద, ఇతరుల మీద, ఆ హిరో ఇమేజ్ మీద ఎంతగా ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకించి ఆ హీరోd అభిమానుల మీద ఎంతటి దుష్ప్రభావాన్ని చూపిస్తుందో సదరు దర్శకులు సీరియస్ గా ఆలోచించుకోవాలి. ఇది ఎవరినో ఏ సినిమానో దృష్టిలో పెట్టుకుని చెబుతోంది కాదు. దర్శకుడిగా ఇంతవరకు కమర్షియల్ సక్సెస్ సాధించలేని నాకు నేను చెప్పుకుంటోంది కూడా. అయితే నా అదృష్టం ఇప్పటిదాకా నేను పెద్ద హీరోలతో సినిమా చేయకపోవటం. అఫ్కోర్స్ ...ఆ అదృష్టం పెద్ద హిరోలది కూడా. ఇటివల తమిళనాడు లో ఓ పెద్ద హిరో సినిమా దారుణంగా ఫ్లాప్ కావటంతో సదరు హిరో అభిమాని ఆత్మహత్య చేసుకున్న వార్త నా చేత ఈ వ్యాసం రాయించింది.  దట్సాల్...




                  

4 కామెంట్‌లు:

  1. బావుందండీ. కానీ ఆ భాద్యత కేవలం దర్శకునిదే ఎలా అవుతుంది. ఆ అభిమానులు ముందు ఆ పెద్ద హీరోకే గాని దర్శకునికి కాదు కదా. సో వాళ్ళని త్రుప్తి పర్చాల్సిన భాద్యత మొదట హీరోదే. అషామాషిగా సినిమాని కమిట్ అవ్వటం వాళ్ళు చేసే మొదటి తప్పు. ఎంత పెద్ద దర్శకుడు వచ్చినా, కాస్త టెం తీసుకుని కథని సానబడితే ఇంత గొడవ ఉండదు. రజనీ గారి సినిమాలు తీస్కుంటే, ఎప్పుడో ఒకటి అంచనా తప్పి ఫ్లాప్ అవుతాయి తప్ప, కథ, కథనం విషయాలలో వాళ్ళు తీసుకునే శ్రద్ద కనపడుతుంది. అలాగే ఒక పెద్ద హీరోతో సినిమా నిర్మించాలనుకున్న నిర్మాతలు కూడా, ఒక ముప్పై కోట్లు ఫణంగా పెడుతున్నప్పుడు, మంచి స్క్రిప్ట్ రెడీ అయ్యాకే సినిమా మొదలెట్టాలి. దుక్కిపాటి గారు అక్కినేని గారితో సినిమాలు చేసినప్పుడు, ఆయన పీక్ టైంలో ఉన్నప్పుడు కూడా ఏనాడూ కథని, పక్కా స్క్రిప్ట్ ని నిర్లక్ష్యం చేసింది లేదు. కానీ ఈనాడు నిర్మాత అంటే కేవలం డబ్బులు పెట్టే వాడు అన్న అభిప్రాయంలో ఉన్నారు.

    రిప్లయితొలగించండి
  2. అభిమానులు తమ అభిమాన హీరో నుంచి ఒక మంచి సినిమా కావాలని ఆశిస్తారు. కానీ హీరోలూ, డైరెక్టర్లూ అనవసరమైన స్టార్ ఇమేజ్ ఊహించుకుని తమ ఫాన్స్లో తమ ఇమేజ్ ఎక్కడ పడిపోతుందో అని అనవసర భయాన్ని ఊహించుకుని ఎప్పుడూ ఒకే మూస సినిమాలు తీసి ప్రెక్షకుల మొహాన కొడతారు.

    ఇంతకూ ఇప్పటి తరంలో పెద్ద హీరోలంటే ఒక పెద్ద నిర్మాత కొడుకులా, లేక ఒక పాతతరం పెద్దహీరో కొడుకులూ మేనళ్ళుళ్ళూనా?

    రిప్లయితొలగించండి
  3. ఆయా హీరోలను అభిమానించినంత అపరిమితంగా తమను తామభిమానించుకొంటే ఈ గొడవే వుండదు. తమ కుటుంబాలను, పెళ్ళాంబిడ్డలను పట్టించుకోని బడుధ్ధాయిల ఇగోలను ఎక్కడో వున్న దర్శకనిర్మాతలు పట్టించుకోవలనుకోవడం అవివేకం. మళ్ళా ఈ రంధిలో సినిమాలలో (సాహిత్యపు) విలువలు పడిపోతున్నాయని మనమే గొంతు చించుకొంటాం.

    రిప్లయితొలగించండి
  4. ఏ దర్శకుడైనా , హీరో అయినా తమ సినిమా హిట్ అవ్వాలనే కష్ట పడతారు
    అయితే ఎప్పటికప్పుడు మారి పోయే ప్రేక్షకుల నాడిని పసి గట్టడం లోనే విఫలం అవుతారు .
    కధని హీరో పరం గా దర్శకుని ద్రుష్టి పరం గానే చూస్తారు గాని ప్రేక్షకుడి పరం గా చూడక పోవడం తో విడుదల అయ్యాక
    పల్టీలు కొడుతోంది .అందుకే ఏ దర్శకుడైన తన కధని తన వంది మాగతులకి వినిపించి
    వహ్వా వహ్వా అనిపించుకుని మోస పోయే కంటే ,న్యూట్రల్ పెర్సన్ కి వినిపించి జాగర్త పడడం మంచిదేమో.

    రిప్లయితొలగించండి