24, జనవరి 2011, సోమవారం

ఈవివి గారు...మమ్మల్ని ఎందుకింత మోసం చేశారు...?


        దర్శకుడు ఈవీవీ చనిపోయారన్న తప్పుడు వార్త నేను గానీ, నవ్వుగానీ, నవ్వించేవారు గానీ, నవ్వేవారు గానీ నమ్మట్లేదు.ఇది వివాదాస్పద విషాద వాస్తవం. యాభైయొక్క సినిమాల పాటు మనల్ని నవ్వించి..నవ్వించి చివరకు ఇంత హఠాత్తుగా తాను మాత్రం నవ్వుకుంటూ సుదూర తీరాలకు వెళ్ళిపోయిన ఈ దర్శకున్ని ఏమనాలి..? ఇ అంటే ఎనర్జిటిక్..వి అంటే వెరైటి..వి అంటే వర్సటైల్.....అన్నది నా ఉద్దేశ్యం..జంధ్యాల గారి శిష్యుడిగా హాస్య చిత్రాలలో తనకు అంటూ ఒక శైలిని..మార్కును ఏర్పరచుకుని, తను నమ్ముకున్న మార్గంలో హాస్యాన్ని పండిస్తూ, బతికిస్తూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న నవ్వుల మల్టీమిల్లియనిర్ మన ఈవివి గారు. ఇవివి గారు కేవలం గొప్ప దర్శకుడే కాదు...గొప్ప రచయిత..మరింత గొప్ప నటుడు...అన్నిటిని మించి మంచి మనసున్న గొప్ప వ్యక్తీ...ఆయనలో అతి గొప్ప క్వాలిటి...హోమ్ వర్క్..ఎప్పుడు చూసినా ఆఫీసులో ఏదో ఒక స్క్రిప్ట్ రాసుకుంటూ ఆయన మనకు దర్సనమిస్తారు.ఈవివి గారికి సినిమా తప్ప మరొకటి తెలియదు. సినిమా ఆయనకు సర్వస్వం...ఆయనకు సినిమా ఓ వ్యసనం..ఎన్నెన్నో ప్రయోగాలు..." అల్లుడా..మజాకా...? " సినిమా ఆయనే తీశారు.." ఆమె " సినిమా కూడా ఆయనే తీశారు.. " జంబలకిడి పంబ " సినిమా ఆయనే తీశారు.. " అమ్మో..ఒకటో తారీకు..! " సినిమా కూడా ఆయనే తీశారు...ఆయనో దర్శక సవ్యసాచి అన్నది ఈ సినిమాల వేరియేషన్ను  బట్టి మనకే అర్ధం అవుతుంది. ఇలా ఒకటి కాదు.. ఎన్నో... ఎంతటి విషాద సన్నివేశంలోనయినా ప్రధానమయిన మూడ్ పాడవుకుండా ఎంత వీలుంటే అంత కామెడీని చొప్పించి ప్రేక్షకున్ని నవ్వించేందుకు శతధా సహస్రధా ప్రయత్నించే గ్రేట్ డాక్టర్ డైరెక్టర్ ఈవివి గారు. మనందర్నీ ఇంతగా నవ్వించిన ఈ దర్సకుడ్ని మృత్యువు కనికరం లేకుండా తీసుకుపోతుందని ఎవ్వరం కలలో కూడా ఉహించలేదు. ఇది భగవంతుడు చేసిన అన్యాయం..దుర్మార్గం...దారుణం..గురువు జంధ్యాల గారు యాభై ఏళ్ళకు కన్నుమూస్తే..శిష్యుడు ఈవివి యాభై మూడేళ్ళకు తనువు చాలించారు...నవ్వించి నవ్వించి మన ఆయుష్షు పెంచి వాళ్ళు మాత్రం అర్దాయుష్కులై వెళ్ళిపోయారు. ఇది ఏమాత్రం జీర్ణమ్ కాని చెడు నిజం..తెలుగు సినిమా తెరమీద హాస్యం వున్నంతకాలం జంధ్యాల గారితో బాటు ఈవివి కూడా గుర్తుండిపోతారు.. కామెడి లవర్స్ అయిన ప్రేక్షకులు ఎన్నటికి, ఏనాటికి వీళ్ళను మరచిపోరు...

     ఈవివి గారు...మగరాయుడు సినిమాలో మీరు మీ హీరో ని బతికించినట్టు మీరు కూడా మళ్లీ బతికి రండి. మీరు తీయాల్సిన సినిమాలు చాలా వున్నాయి. ఇంకో యాభై ఏళ్ళ పాటు వుండి వాటిని పూర్తి చేసి వెళ్ళండి... తెలుగు సినిమా ప్రేక్షకులుగా ఇది మా ఆదేశం...విజ్ఞప్తి..గమనిక ...ప్రార్ధన...ఆవేదన...ఆక్రందన...అర్ధం చేసుకోండి...మీరు చనిపోయారన్న వార్త నమ్మలేక  మేము చచ్చి పోతున్నామండి...మమ్మల్ని అర్ధం చేసుకోండి..మీ దారిన మీరువెళ్ళిపోతే ఇక్కడ మా పరిస్థితి ఏవిటండి..?
ప్లీజ్..పైన మాట పోతే పోయింది..వెనక్కు వచ్చేయండి సర్...నవ్వును మరింత ముందుకు తీసుకు వెళ్ళండి సర్....ఇది కామెడి శ్వేత పత్రం  మీద కోట్లాది మంది హాస్య ప్రియులు తమ నవ్వుల కలాలతో చిరునవ్వుల సంతకాలు పెట్టి మీకు పెట్టుకుంటున్న బరువైన దరఖాస్తు...మందస్మిత మానవత హృదయంతో నిర్ణయం తీసుకోండి  సర్...!!!1 వ్యాఖ్య: