21, జనవరి 2011, శుక్రవారం

కేరళా..! అంత నిర్లక్ష్యం తగదు....!!!


          కొద్దిరోజుల క్రితం శబరిమలలో జరిగిన దారుణమైన ప్రమాదం ఎవరినయినా కలచివేసే సంఘటన. ఒకరిద్దరు కాదు..వందమందికి పైగా ఈ ప్రమాదంలో కన్ను మూయటం అనేది వింటేనే ఎవరికయినా కళ్ళు చెమర్చక మానదు. ఈ ఘోరానికి కారణమేమిటి ? కారకులెవరు ? దర్శనం అయి కొండ దిగిన తరువాత సాధ్యమయినంత త్వరగా ఇళ్ళకు చేరుకోవాలని భక్తులు ఆత్రుతగా కొండ దిగటం సహజం. ఆ పరుగులో కొంత తొట్రుపాటు వుండటం కూడా అంతే సహజం. ఈ సమయంలో భక్తులకు సరయిన ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత అయ్యప్ప దేవస్థానం బోర్డ్, కేరళ ప్రభుత్వాలది. ఈ రెండు తమ బాధ్యతలను విస్మరించటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమనేది నా నిశ్చితాభిప్రాయం.ఏటా కోట్లమంది భక్తుల్ని ఆకర్షిస్తున్న ఈ ఆలయ నిర్వహణ, రహదార్ల విస్తరణ, పార్కింగ్, పరిశుభ్రత,
తదితర అంశాల్లో కేరళ దేవస్వం బోర్డ్ తన నిర్లక్ష్యాన్ని, నిర్లిప్తతను, నిస్తేజాన్ని పూర్తిగా వదిలిపెట్టి సత్వర చర్యలు చేపడితేనే మున్ముందు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కావు. అయ్యప్ప భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దేవాలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు కేటాయించాలి. అలా కాకుండా ఇదే పధ్ధతి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఇలాంటి దుస్సంఘటనలు జరుగుతూనే వుంటాయి. శబరిమలకు వచ్చే భక్తుల్లో అధికశాతంమంది తెలుగు వాళ్ళే వున్నారు కాబట్టి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించి స్పందించాలి. తన వంతుగా కేరళ సర్కారుపై వత్తిడి తీసుకురావాలి. లేకపొతే అయ్యప్ప భక్తులే కాదు...అయ్యప్ప కూడా క్షమించడు. ఆధ్యాత్మిక పరంగా ఇంతటి మహత్తర శక్తిని తమ రాష్ట్రంలో కొలువు తీర్చుకున్న మళయాళ సర్కారు దీనిని దుర్వినియోగ పరచుకోకూడదు...మరోసారి ఇలాంటి దుస్సంఘటన రిపీట్ అయితే ఆ పాపం కేరళ సర్కారుది...చోద్యం చూస్తున్న ఆంద్ర ప్రదేశ్ ది...ఈ రెండు ప్రభుత్వాలు ఇప్పటికయినా నిద్రలేస్తే మంచిది..లేకపొతే చిన్న ఝలక్ ఇచ్చి అయ్యప్పే నిద్ర లేపుతాడు...ఇక ఆ తరువాత అంతా స్వామియే శరణం అయ్యప్ప.....!

      

1 వ్యాఖ్య:

  1. అవును ఏవీయస్ గారూ,
    3 రోజుల క్రింద నేను శబరిమల వెళ్ళి వచ్చాను. పరిశుభ్రత అనేదే లేదు. తిరుమల లో రోజూ లక్షల లో జనం వస్తారు. పవిత్రత తప్ప అపరిశుభ్రం ఉండదు. ప్రభుత్వం, దేవస్థానం నిర్లక్ష్యం నిజమే కాని, అక్కడ సీజన్ లో వ్యాపారాలు చేశే వారూ, అయ్యప్ప భక్తులు కూడా పరిశుభ్రత కి తోడ్పడాలి. భక్తులు పోసిన చెత్తా చెదారం (ప్లాస్తిక్ బాటిళ్ళ నుంచి, దీక్ష బట్టల వరకు) క్లీన్ చెయ్యడానికి దేవస్థానానికి కొన్ని నెలలు పడ్తుంది (ఈ లోపు ఏ తుంటరో అగ్గిపుల్ల వేసి అడవంతా కాల్చకుండా ఉంటే)
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    ప్రత్యుత్తరంతొలగించు