11, జనవరి 2011, మంగళవారం

సేవ్ ఆంధ్రప్రదేశ్...!!!

      కృష్ణాజలాలకు సంబంధించి ట్రిబ్యునల్ తీర్పు విన్న తరువాత సాంకేతికంగా పెద్దగా ఏమీ తెలియని నాలాంటి వాడు కూడా షాక్ అయ్యాడు. మొత్తానికి రాష్ట్రానికి చాలా పెద్ద అన్యాయం జరగబోతోందని అందరికీ అర్ధం అయింది. మన ఖర్మ ఏవిటో తెలియదు గానీ మనకు జరగబోతున్న అన్యాయం విషయంలో ఎప్పుడూ అసమర్ధంగానో, అలక్ష్యం గానో పోరాడతాం. కనీసం పక్క రాష్ట్రాలను చూసయినా నేర్చుకోం. భాష విషయంలోనూ, సంస్కృతి విషయంలోనూ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ, చివరికి పరాయి భాషల సినిమాల  విడుదల విషయంలో కూడా కొన్ని పక్క రాష్ట్రాలకున్న కమిట్ మెంట్ మనకు, మన పాలకులకు లేకపోవటం సిగ్గుచేటు..పోరాటాలు లేవు...చిత్తశుద్ధి లేదు...రాష్ట్రం పట్ల అభిమానం లేదు....ప్రతీది రాజకీయమే...ప్రతి అంశాన్ని రాజకీయంగా ఆలోచించటమే...ఏది చేస్తే పక్క పార్టీకి ఏమి లాభం జరుగుతుందోనన్న భయం తప్పితే జనం గురించో...స్టేట్ గురించో ఆలోచించే వాడు లేడు. ఒకవేళ ఏ ప్రతిపక్షం వాళ్లయినా సిన్సియర్గా ఫైట్ చేస్తుంటే వాళ్ళను ఎలా దెబ్బతీయాలా అనే అధికారంలో వున్న వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు తప్పితే....ఫైట్ చేస్తున్న ఇష్యూలో నిజాయితీ ఉందా..లేదా అన్నది రూలింగ్ పార్టీ వాళ్ళు ఆలోచించరు. అలాగే ఇటు కూడా...ఇదీ మన దుస్థితి...రైతులు నాశనం అయిపోతే పట్టించుకునే తీరిక పాలకులకు లేదు...నిత్యావసర వస్తువులతో బాటు పెట్రోల్ ధరల్లాంటివి అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతుంటే వాటి గురించి కేంద్రంతో డీకొనే ఆసక్తి రూలింగ్ పార్టీ వారికి లేదు. చివరికి ' ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తోంది ' అనే దారుణమయిన పరిస్థితిలో ఆంద్రప్రదేశ్ వుందంటే ఈ పాపం మూట  కట్టుకుంటున్నదెవరు ? ఈ ట్రిబ్యునల్ తీర్పుల ఫలితంగా కొన్నేళ్ళ తరువాత కోట్లాదిమంది జనం సాగు నీరూ తాగు నీరూ లేక ఆత్మహత్యలు చేసుకుంటూ వుంటే అది ఏ పాలకుల అక్కౌంట్ లో జమ అవుతుంది ? ఇన్నేళ్ళ పాటు వాదించి తన అసమర్ధత కారణంగా కేసు ఓడిపోయేలా చేసిన న్యాయవాదికి ప్రభుత్వం ఏ శిక్ష విధిస్తుంది ? ఇన్నేళ్ళ పాటు ఈ కేసు విషయంలో న్యాయ వాదులకు ఎన్ని కోట్లు ప్రభుత్వం చెల్లించింది ? దాన్ని ఎలా రాబడుతారు ?
ఎక్కడ లోపం ఉంది ? న్యాయవాదులలోనా? సమాచారలోపం వల్లనా? ఎందుకు ట్రిబ్యునల్ ముందు మనం ఓడిపోయాం ? ౩౩ మంది పార్లమెంట్ సభ్యులు ఉండి మనకు ఏవిటీ ఖర్మ ? ఈ ప్రశ్న ఎవరిని అడగాలి ? ఎవరు అడుగుతారు ?  ఎవరు సమాధానం చెబుతారు ? 


      అయినా జగన్ ఎంత మందిని చీలుస్తాడు...ప్రభుత్వం మైనారిటీలో పడితే ఏం చేయాలి...తెలంగాణా ఉద్యమాన్ని ఎలా ఫేస్ చేయాలి...లాంటి అనేకానేక సవాళ్ళతో తల్లడిల్లుతున్న సర్కారుకు అధిష్టానం పేరుతో అస్తవ్యస్తతకు కారకులయిన హస్తిన పెద్దలకు ఆంద్ర ప్రదేశ్ గోడు ఎలా వినిపిస్తుంది...ఎప్పటికి వినిపిస్తుంది....అప్పటికి ఆంధ్ర ప్రదేశ్ ఏమయిపోతుంది...??? పూర్ ఆంధ్ర ప్రదేశ్ ...సేవ్ ఆంధ్ర ప్రదేశ్...!!!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి