8, నవంబర్ 2012, గురువారం

మహానుభావుడు ఎన్.టి.ఆర్....!





   ఉత్తినే మహానుభావులు కారు.....చేస్తున్న పని పట్ల చిత్తశుద్ధి, అంకితభావం,
  నిజాయితి ఉంటేనే ఆ పనికి ఒక పరమార్ధం, ఆ మనిషికి ఒక సార్ధకత
  సమకూరతాయి. ఈ విషయంలో ప్రపంచం గర్వించదగ్గ మహానటుడు
  నందమూరి తారక రామారావు పేరును ముందు వరసలో చెప్పుకోవాలి.
  నటుడిగా ,క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఎన్.టి.ఆర్. స్థానాన్ని
  ఎవరూ భర్తీ చేయలేరన్నది నిర్వివాదాంశం.ఇందుకు ఉదాహరణగా
  ఆయన స్వంత చిత్రం " శ్రినాధకవిసార్వభౌముడు " చిత్రం షూటింగ్
  సమయంలో  జరిగిన ఒక సంఘటనను పేర్కొనవచ్చు. ఈ సినిమాకు
  ప్రముఖ దర్శకుడు బాపు దర్సకత్వం వహించారు.

  నాచారం లోని రామకృష్ణా స్టూడియో లో షూటింగ్ జరుగుతోంది....
  ఎండలు మండి పోతున్న రోహిణికార్తే రోజులు..... మిట్టమధ్యాహ్నం 
  12 గంటల సమయం.... శ్రినాదుడిని రాజభటులు గొలుసులతో
  కట్టివేసి  కొరడాలతో కొట్టే సన్నివేశాన్ని బాపు చిత్రీకరిస్తున్నారు.
  షాట్ జరుగుతోంది. అప్పుడు రామారావు గారివయస్సు డెబ్భై
  దాటాయి. అయినా ఆయనది ధృడకాయం కావటంతో శరీరం 
  తెల్లగా, రిచ్ గా మెరిసిపోతోంది.షాట్ తీస్తున్నప్పుడు రామారావు
  ఒక్కసారి తన బాడి ని తనే చూసుకున్నారు. ఆయనకు సంతృప్తిగా 
  అనిపించలేదు. వెంటనే బాపు ను పిలిచారు.
  " బాపు గారూ..కొరడాలతో కొడుతున్నారు కదా...శరీరం 
  ఎర్రగా కమిలి పోయినట్లుగా వుంటే బావుంటుంది కదా..." అనడిగారు.
  అందుకు బాపు " నిజమే...కానీ  బాడీ కి ఎర్ర రంగు వేస్తే
  తెలిసిపోతుంది..." అన్నారు. " ఎర్రరంగు ఎందుకు బ్రదర్...
  టైం పన్నెండయింది కదా... బ్రేక్ ఇవ్వండి...ఈ షాట్ రెండు
  గంటలకు పెట్టండి...." అన్నారు ఎన్.టి.ఆర్.... ఆయన రెండు
  గంటల సమయం ఎందుకడిగారో ఎవరికీ అర్ధం కాలేదు..
  బ్రేక్ ఇచ్చారు బాపు...రామారావు తన అసిస్టెంట్ ను 
  పిలిచి ఒక పడక కుర్చీ ని తెప్పించుకున్నారు. 
  రెండు ఫ్లోర్ల మధ్య ఎర్రటి ఎండలో ఆ కుర్చీ వేయించుకున్నారు.
  కళ్ళు మూసుకుని పడుకున్నారు. అందరూ ఆశ్చర్యపోయారు.
  ఆయన ఎందుకలా చేస్తున్నారో అర్ధం  కాలేదు...సరిగ్గా రెండు
  గంటలకు రామారావు కళ్ళు తెరిచి " బాపూ గారూ...నేను రెడి
  ...షాట్ రేడియా ? " అనడిగారు....అప్పుడు ఆయన శరీరం ఎర్రగా
  మారిపోయి వుంది. బాపు తో సహా అక్కడున్న వందలాది మంది 
  షాకయ్యారు...శరీరం ఎర్రబడటానికి ఆయన తనకు తాను శిక్ష
  వేసుకున్నారు. షాట్ క్వాలిటి కోసం డెబ్భై ఏళ్ల వయసులో కూడా
  అంత రిస్క్ తీసుకున్నారు. నటుడిగా ఏ మాత్రం రాజీ పడని
  మనస్తత్వం ఆయనది.ఆయన కమిట్ మెంటు చూసి
  అక్కడున్నవారందరూ చేతులెత్తి ఆయనకు నమస్కరించకుండా 
  ఉండలేకపోయారు. దట్ ఈజ్ ఎన్.టి.ఆర్..!! 





    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి