27, జులై 2011, బుధవారం

డబ్బింగ్ ఫిలిం ఫెస్టివల్....





ఈ మధ్యన ఓ ఫ్రెండ్ టెక్నిషియన్  " తెలుగు సినిమా లు తీసే వాళ్ళందరం మళ్లీ మద్రాస్ బదిలీ అయిపోదాం..మన తెలుగు సినిమాలనే డబ్బింగ్ సినిమా అనే పబ్లిసిటి ఇచ్చి ఇక్కడ రిలీజ్ చేద్దాం..అప్పుడు గాని మన తెలుగు సినిమాలు హిట్లు కావు..." అనే ఓ విప్లవాత్మకమయిన సలహా ఇచ్చాడు..వాడి డిప్రెషన్ నాకు అర్ధం అయింది...ఇక్కడ విడుదల అవుతున్న అరవ డబ్బింగ్ చిత్రాలు సూపర్ హిట్లవుతూ మన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్న నేపధ్యంలో ఇలాంటి ఆలోచనలు రావటం పెద్ద ఆశ్చర్యం ఏమీకాదు..జనం డబ్బింగ్ సినిమాలను ఇష్ట పడుతున్నంతగా డైరెక్ట్ తెలుగు సినిమాలను ఇష్ట పడటం లేదన్నది మా వాడి బాధ...కర్నాటక మాదిరిగా పరాయి భాషా డబ్బింగ్ సినిమాలను నిషేదిస్తేనే తెలుగు సినిమాలు బతుకుతాయని కుడా వాడి ఆవేదన..తెలుగులో తిసి విజయవంతమయిన సినిమాల రైట్లు కొని వాటిని అరవంలో తీసి మళ్లీ అదే సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే అవి కూడా  హిట్ అవుతున్నాయి..పైగా భారీ పబ్లిసిటితో....తమిళ హీరోలను తెలుగు ఆడియెన్స్ ఆదరించినంతగా...తెలుగు హీరోలను తమిళ ప్రేక్షకులు ఎందుకు ఆదరించటం లేదు....ఎక్కడ లోపం వుంది...తెలుగు హీరోల స్టామినా తక్కువైంది కాదే....తెలుగు టెక్నిషియన్లు తక్కువయినా వాళ్ళు కాదే....డబ్బింగ్ సినిమాలకు ఉన్నంత ఓపెనింగ్స్ తెలుగు సినిమాలకు ఎందుకు వుండటం లేదు...? తెలుగులో స్ట్రెయిట్ సినిమాలకంటే డబ్బింగ్ సినిమాల సంఖ్య దాదాపు రెట్టింపు వుండటానికి కారణం ఏవిటి...? డబ్బింగ్ సినిమాలకు దొరికినంత సులభంగా డైరెక్ట్ సినిమాలకు థియేటర్లు ఎందుకు దొరకటం లేదు....? డబ్బింగ్ సినిమాలకు 24 శాతం వర్కవుట్ అవుతున్న టాక్స్  అందులో మూడవ వంతయినా తెలుగు సినిమాలకు ఎందుకు వర్కవుట్ కావటం లేదు...? తమిళనాడులో పైరసీ ని నిషేధించినంత సమర్ధంగా మన రాష్ట్రంలో ఎందుకు చేయలేక పోతున్నాం..? ఆ మాత్రం సమర్ధత మనకు లేకనా...ఆసక్తి లేకనా...? తెలుగు సినిమాకు ఎందుకీ దీనస్థితి...? కొంచెం తీరిగ్గా కూచుని ఆలోచిస్తే ఇలాంటి ప్రశ్నలెన్నో....
           ఒక్కటి నిజం....తను చూసేది తెలుగు సినిమానా...డబ్బింగ్ సినిమానా అన్నది ప్రేక్షకుడికి అనవసరం....సినిమా బావుంటే ఏదయినా చూస్తాడు...లేదంటే సింపుల్ గా తిరస్కరిస్తాడు...అంటే ప్రేక్షకుడికి కావలసినదేదో డబ్బింగ్ సినిమాలలో లభిస్తోందనే అనుకోవాలి...అలా అని తెలుగు సినిమాల స్థాయిని తక్కువ చేసి మాట్లాడటం కాదు...ప్రతి శుక్రవారం తెలుగు సినిమాలు రెండు రిలీజ్ అవుతుంటే తమిళ్ డబ్బింగ్ సినిమాలు ఐదో, ఆరో విడుదల అవుతున్నాయి...నిర్మాతలకు...ప్రత్యేకించి డబ్బింగ్ సినిమా మేకర్లకు అవే లాభసాటిగా వున్నాయన్నది స్పష్టంగా కనపడుతోంది...ఎక్కడిదాకానో ఎందుకు...కేవలం నెల రోజుల తేడాతో  రిలీజ్ అయిన వాడు వీడు, కాంచన, నాన్న సినిమాలు పోటిపడి కలెక్షన్లు వసూలు చేస్తున్నాయి..మనకేమో గత ఆరు నెలల కాలంలో కేవలం నాలుగైదు సినిమాలు మాత్రమే సక్సెస్ అయినాయి...తెలుగు సినిమాల సక్సెస్ రేట్ దారుణంగా పడిపోతోంది...హిట్లు లేకపోవటంతో సినిమా నిర్మాణం బాగా తగ్గిపోయింది....పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళ పరిస్థితి దారుణంగా తయారయింది...నాకు తెలిసి తెలుగు సినిమాకు ఉన్నన్ని శాపాలు మరే భాషా పరిశ్రమకు ఉండవేమో...పబ్లిసిటి, థియేటర్లు, పైరసీ, బిజినెస్....ఇలా ఇక్కడ అన్నీ సమస్యలే...ఇన్ని అవరోధాలు దాటుకుని ఏదో విధంగా సినిమా రిలీజ్ చేస్తే ఓపెనింగ్  కలెక్షన్లు వుండవు....అన్నిటిని మించి లక్షా తొంభయి టివి చానెళ్ళు...కొత్తగా సినిమా తీద్దాం అనుకుని  వచ్చిన నిర్మాత మొదటి సినిమాతోనే పారిపోతున్నాడు...ఇక్కడ ఎవర్నీతప్పు పట్టలేం...ఎంత సిన్సియర్ గా కృషి చేసి ఎంత మంచి సినిమా తీసినా సినిమా సక్సెస్ నే పరిగణనలోకి తిసుకుంటారే గానీ...మంచి సినిమానే ...అని ఎవరు అనుకోరు...అది సహజం....నిర్మాతకు డబ్బులు తెచ్చిపెట్టిందే మంచి సినిమా....ఇందులో రెండో ఆలోచనకు ఆస్కారం లేదు...ఇక డబ్బింగ్ సినిమాలను నిషేధించాలనే వాదన పూర్తిగా సమర్ధనీయం కాదన్నది నా అభిప్రాయం...అలా కాకుండా వాటి టాక్స్ పెంచి పరిమితమయిన థియేటర్లలోనే విడుదల చేయాలనే నిబంధన విధిస్తే మంచిదన్న వాదనతో నేను కుడా ఎంతో కొంత ఏకీభవిస్తాను...అన్నిటికంటే ముందు మన సరుకు బావుండేలా మనం జాగ్రత్తలు తీసుకోగలిగితే  ఎంతో కొద్దిగా మార్పు   కూడా  వుండచ్చేమో....మనకు మంచి నిర్మాతలున్నారు...మంచి దర్సకులున్నారు..
గొప్ప సాంకేతిక నిపుణులున్నారు...ఒక మంచి సినిమా తీసేందుకు అవసరమయిన వనరులన్నీ వున్నాయి...మంచి సినిమాలు తీయటం కాదు...వాటిని ఎలా సక్సెస్ చేసుకోవాలి అన్నదే ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమ ముందున్న పెద్ద ప్రశ్న...నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణిదార్లు, బయ్యర్లు ముందు ఈ అంశం మీద మీటింగులు పెట్టాలి...చర్చలు జరపాలి...మన కష్టం వృధా కాకుండా ప్రేక్షకుడికి ఏది కావాలో అదివ్వగలిగితే   తెలుగు సినిమా బతికి బట్ట కట్ట గలుగుతుంది..ఎన్ని డబ్బింగ్ సినిమాలు వచ్చినా మనల్నేమీ  చేయలేవు...!




2 కామెంట్‌లు:

  1. "అన్నిటికంటే ముందు మన సరుకు బావుండేలా మనం జాగ్రత్తలు తీసుకోగలిగితే" Well said.

    రిప్లయితొలగించండి
  2. ఓ ప్రేక్షకుడు తన కుటుంబంతో సరదాగా ఓ మంచి సినిమాకి వెళ్దామంటే కనీసం డబ్బింగ్ సినిమాలయినా ఉన్నాయి. ఇప్పుడు వాటిని కూడా నిషేదించో, లేదా వాటికి టాక్స్ పెంచో, థియేటర్లు తగ్గించడమో చేసి, ఇప్పుడున్న తెలుగు సినిమాలని ఈ నాణ్యత తోనే జనాల మీద రుద్దాలనుకోవటం ఎంత వరకు సమంజసం? మన దగ్గరున్న నటులు, టెక్నీషియన్లు అందరూ చేయదగ్గ వారే...జస్ట్ ఆత్మవంచన మానుకుని మంచి సినిమా తీస్తే ఎందుకు చూడరు....తీయటం కష్టమే కాని ఇంపాజిబిల్ కాదు.

    రిప్లయితొలగించండి