19, మార్చి 2011, శనివారం

రాకోయి చందమామా...!

              చందమామ భూమికి దగ్గరగా వచ్చాడు చాలా కాలం తర్వాత....గతంలో ఇలా వచ్చినప్పుడు ఏం జరిగిందో నాకు గుర్తు లేదు కాని,  ఈ సారి బోలెడన్ని ముచ్చట్లు....అయినా తనకు తెలియకుండా భూమ్మీద ఏదో జరిగిపోతోందని కంగారేమో మరి చంద్రుడు కిందకు వచ్చాడు...ఇక్కడ ఏం చూద్దామని... ఏం విహరిద్దామని....? ప్రస్తుతం ఇక్కడ భగ్న ప్రేమలు తప్ప ప్రేమలు లేవే...!! యాసిడ్ దాడులు తప్ప  వలపు గాధలు లేవే....!!!! నా ఉద్దేశ్యం చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చిన కారణం వేరు....కబ్జా చేసేందుకు మనుషులకు భూమి మీద ఉన్న స్థలం మొత్తం  పూర్తి అయిపోయి తదుపరి భూమి కోసం చంద్ర మండలానికి ప్రయాణమవుతున్న నేపధ్యంలో భూమ్మిది రియల్టర్లు, కబ్జాదారులతో... మధ్యలో బ్రోకర్లతో సంబంధం లేకుండా తనే స్వయంగా వ్యాపార లావాదేవీలు మాట్లాడుకునేందుకు మిస్టర్ చందమామయ్య ఈ ఏరియా కు వచ్చాడట...కమిషన్లు, బ్రోకరేజిల విషయాలు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవటం బెటర్ కదా...ఇది పక్కన పెడితే ఈ చంద్రుడు భూమికి దగ్గరగా రావటాన్ని కొంతమంది ఏదో భూతద్దంలో చూపించి భయపెట్టేస్తున్నారు. ఏవో ప్రకృతి వైపరీత్యాలు జరగబోతున్నాయని కంగారు పెడుతున్నారు... తెల్లవారి లేస్తే అమ్మ లాలి పాట పాడుతూ 'చందమామ రావే జాబిల్లి రావే' అని పిలుస్తుంది. .....ప్రేమికులు వెన్నెల్లో వాకింగ్ చేస్తూ 'రావోయి చందమామ' అంటూ విరహగీతాలు పాడతారు..మేనమామలు మేనల్లుళ్ళను భుజాన వేసుకుని 'చందురుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే' అంటూ మెలోడియస్ గా పాడతారు.  పగలంతా సమ్మర్ ఎండల్లో మాడిపోయిన జనం సాయంకాలం చంద్రుడు రాగానే  పెద్ద రిలీఫ్ గా ఫీల్ అవుతారు. మరి అదేం విచిత్రమో గాని చంద్రుడు నిజంగానే భూమికి దగ్గరగా 
వస్తోంటే ఎందుకింత భయం...? ఏం దోచుకుపోతాడని....? 
                మా ఫ్రెండ్ సత్తిబాబు ఈ పరిణామానికి ఇంకో భాష్యం చెప్పాడు.. ఇటివలి ఒక ఆందోళనలో టాంక్ బండ్ పైన నేల కూలిన తెలుగు వెలుగుల విగ్రహాలను  సందర్శించి గ్రహాల తరపు సానుభూతిని తెలిపేందుకు చంద్రుడు స్వయంగా బయలుదేరి వచ్చాడని...ఎవరి అభిప్రాయం వారిది...కాదు అనటానికి  మనమెవరం...? మనమయితే భూమ్మీద ఏ స్థలాన్ని ఎవడు కబ్జా చేసాడు...ఏ స్థలాన్ని ఎవడు ఎవడికి ధారాదత్తం చేసాడు అనే వివరాలు చూడాలంటే ఏ గూగుల్ మ్యపో చూడాలి. చంద్రుడికి ఆ సమస్య లేదు. డెయిలీ అన్ని కనిపిస్తూ వుంటాయి....భూమికి దగ్గరగా వచ్చి తను మరింత ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు.... కాని తనకు మాత్రం భూమి మొత్తం గతం కంటే నల్లగా కనిపిస్తోంది...వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం, ఆర్ధిక కాలుష్యం, పారిశ్రామిక కాలుష్యం, మానవ సంబంధాల కాలుష్యం లాంటి వాటితో భూమి నల్లబడింది...చంద్రుడు తెగ డిసప్పాయింట్ అయి ఉంటాడు...అందుకేనేమో ఎందుకైనా మంచిదని ఒక్కరోజే క్యాంప్ వేసుకుని వచ్చి మళ్లీ తెల్లవారేసరికి తిరుగు ప్రయాణమయ్యాడు....మరి చంద్రుడు భూమికి చంద్రుడు దగ్గరగా వచ్చినా ఏమి జరగలేదే... టి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ముగ్గురు సస్పెండయ్యారు...పాకిస్తాన్ మీద ఆస్ట్రేలియా ఓడిపోయింది... సి పి ఎం రాఘవులు గారి దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయన్ను లోపల వేశారు హైదరాబాద్ లో హేమమాలిని డాన్సు వేసింది. మంచయినా చెడయినా ఇవేగా జరిగినాయి... మరి అంతగా భయపెట్టిన శాస్త్రవేత్తలు, పంచాంగ కర్తలు, వాటిని ప్రమోట్ చేసిన కొన్ని చానెళ్ళు ఏమి మాట్లాడవే.... ఏది ఏమయినా చంద్రుడు హర్ట్ అయ్యాడు... గతంలో భూమ్మీద మనుషులు  'మామా చందమామా...వినరావా నా కధ....'అని పాడుకునే వాళ్ళు...మరి ఇప్పుడు..... చంద్రుడు భూమ్మీద మనుషులను చూస్తూ 'మనిషీ...ఓరి మనిషీ...వినరావా నా కధా...'అని పాడుకోవలసిన పరిస్థితి....అందుకే నిన్న భూమికి చేరువగా వచ్చింది ' సూపర్ మూన్ ' కాదు ' సో పూర్ మూన్ '.... ఇంతకంటే ఎక్కువ బయట పడదామంటే అవతల చంద్రుడై పోయాడు......


 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి