7, ఫిబ్రవరి 2011, సోమవారం

ఎవరికోసం...ఎందుకోసం....????

          రాష్ట్రంలో ఏ వైపు ఎక్కడ చూసినా ఏదో ఒక దీక్ష...ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సమస్యపై చేస్తున్న దీక్ష..ఈ దీక్షలు చూస్తుంటే మన నాయకులకు సామాన్య ప్రజలపట్ల ఇంత అభిమానం ఉందా..! కామన్ మాన్ సమస్యల పరిష్కారానికి ఇంతమంది ఇన్నిరకాల దీక్షలు చేస్తున్నారా! అన్న ఆశ్చర్యం, దాని వెంటే ఆనందం కలుగుతాయి..నాలాంటి సున్నిత మనస్కులకయితే కంటివెంట ధారాపాతంగా నీళ్ళు కూడా వర్షిస్తున్నాయి...మరే దేశంలోనూ లేనివిధంగా ఒక్క నా దేశంలోనే అందునా నా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే ఇంతటి రాజకీయ చైతన్యం..ప్రజల పట్ల ప్రేమ ఉన్నాయన్న గర్వంతో నా ఛాతీ ఉప్పొంగుతోంది. ఈజిప్టనే దేశంలో పాలకులకు వ్యతిరేకంగా జనం రోడ్ల మీదకు వస్తే అందరం ఆ ప్రజల చైతన్యానికి ఉలిక్కిపడ్దాం.. కాని మన రాష్ట్రంలో అంతకంటే ఎక్కువగా ప్రజలకోసం నాయకులు దీక్షలపేరుతో మీదకు రావటం   చూస్తుంటే మనస్సు ఉబ్బితబ్బిబ్బవుతోంది...నా నాయకులకు ఎంతటి మానవత్వం...ఎంతటి మహోన్నత తత్వం...అది జన దీక్ష కావచ్చు..జల దీక్ష కావచ్చు..ప్రాంతీయ దీక్షలు కావచ్చు....మరో దీక్ష కావచ్చు..                 " ఈ దీక్షలన్ని ఉత్తి ఫార్స్..రాజకీయ అస్తిత్వం కోసం చేస్తున్నవే కాని         చిత్తశుద్ధితో చేస్తున్నవి కావు..అసలు పొట్టి శ్రీరాములు గారి దీక్షను మించిన దీక్ష ఏది వుండి చెప్పండి...ఎన్ని దీక్షల్లో ఫలితాలు వచ్చాయో చెప్పండి ? అంటూ నన్ను ఉపిరాడకుండా ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసాడు.. అది వేరు..ఇది వేరు.. అని ఎంతగా చెప్పినా వినిపించుకోడు.. వాడొక   మూర్ఖుడు.. సరే..వాడిసంగతి వదిలేద్దాం..రాజకీయ అపరిపక్వత పుష్కలంగా వున్న ఒక సామాన్యుడిగా నా స్పందన ఒకటే...ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నంలో భాగంగా శాంతియుతంగా ఇలాంటి దీక్షలు చేయటం సహజమే...సమర్ధనీయమే...కాని ఈ దీక్షలు బలప్రదర్సనలకు వేదికలుగానో, బలనిరూపణలకు అవకాశాలుగానో వాడుకునే ప్రయత్నం చేయటం నేరం..ఇది కొందరు వ్యక్తులకో..కొన్ని పార్టీలకో పరిమితమయిన మాట కాదు..నిరసన వెలిబుచ్చటం కోసమో, ఒక సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తేవటం కోసమో ప్రజాస్వామ్య ప్రక్రియలో మనం ఎంచుకున్న పవిత్ర కార్యక్రమం ఈ దీక్ష....ఇది  కలుషితం అయిపోతోందనే బాధే ఈ వ్యాసం పుట్టుకకు కారణం...అంతేగాని ఎవరినో టార్గెట్ చేయటం నా ఉద్దేశ్యం కాదు.. క్రమేపీ దీక్షల సీరియస్ నెస్ తగ్గిపోతోందనేదే నా ఆవేదన..రాజకీయ నాయకులు దీక్షలు చేయటం అభినందనీయమే కాని..దీక్షలు రాజకీయం కాకూడదు...!!!  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి