9, సెప్టెంబర్ 2010, గురువారం

నిర్మాతకు నిర్వచనం ... నాయుడుగారు ......

ఈ మధ్యకాలంలో చాలా సినిమా షూటింగుల కోసం వైజాగ్ వెళ్ళినా అక్కడ  రామానాయుడు గారు ఇటీవల కొండ మిద కొత్తగా కట్టిన స్టూడియో చూడటం ఇంతవరకు కుదరలేదు.అరకులో నాయుడు గారి సినిమా షూటింగు కోసమే వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తూ ఒకరోజు నాయుడు గారి స్టూడియో లో స్టే చేశాను. ఎంత అద్భుతం..సముద్ర తీరంలో కొండమీద రాళ్లురప్పలు తవ్వి బండలు పగలకొట్టి ఓ అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించిన నాయుడుగారికి సినిమా పరిశ్రమ రుణపడి వుండాలి. సినిమా ప్రేమికులకు ఈ నిర్మాణం ఓ సుందరస్వప్నం. .చుట్టూ సాగర సోయగం....చేతికందే ఆకాశం...ఓ పట్టణాన్ని తలపించే కట్టడాలు....కొండ మీదకు వెళుతుంటే నల్లగా అందంగా మెలికలు తిరిగే తారు రోడ్లు...కొండ మీద ఆకుపచ్చ చీరెకట్టుకున్న చెట్లు చేమలు....చెప్పలేనంత మానసికానందాన్ని కలిగిస్తాయి. మనల్ని మరో లోకానికి పయనింపచేస్తాయి. విజిటర్సుకు ఈ స్టూడియో సందర్శన  ఓ అబ్బురమయితే సినిమా షూటింగులకో వరం. నిర్మాతలకు చెప్పలేనంత సుఖం. రెగ్యులర్ గా షూటింగులకు అవసరమయిన బిల్డింగులు, రోడ్లు, భవనాలు, ఆఫీసులు, పుష్కలంగా వున్నాయి. యూనిట్ ఉండేందుకు అవసరమయిన గెస్టురూములు కూడా చాలా వున్నాయి. విశాఖ అందాలతో పాటు షూటింగులకు అవసరమయిన అన్ని సదుపాయాలను నాయుడు గారు తన అపారమయిన అనుభవంతో తీర్చిదిద్దారు.  
   అయితే ఈ స్టూడియో నిర్మాణం వల్ల అదనంగా లభించే ఆదాయం ఏమీలేదు. పన్నెండు కోట్ల పెట్టుబడికి గాను ప్రస్తుతం విజిటర్సు ద్వారా వస్తున్న ఆదాయం నాకు తెలిసి నెలకు రెండున్నర లక్షలు. ముమ్మరంగా షూటింగులు జరిగి విజిటర్సు సంఖ్య పదింతలు పెరిగినా ఆదాయం అంతంత మాత్రంగానే పెరుగుతుంది. అయితే నాయుడు గారికి సినిమా పట్ల వున్నా ప్యాషన్, డెడికేషన్, ప్రేమ , అనుబంధం లాంటివి ఈ స్టూడియో నిర్మాణానికి ప్రేరణగా చెప్పవచ్చు. వున్నడబ్బును ఎలా పెంచుకోవాలని ఆలోచించే ఈ రోజుల్లో  ఎక్కడయితే సంపాదించామో ఆ పరిశ్రమ కోసం నిస్వార్ధంగా వ్యయం చేయాలని ఆలోచించే నాయుడుగారి లాంటి వ్యక్తులు ఎంతమంది వుంటారు చెప్పండి..! తెలుగు సినిమా గర్వించే స్టూడియో వైజాగ్ స్టూడియో అయితే తెలుగు వాళ్ళు గర్వించదగ్గ వ్యక్తీ రామానాయుడు గారు అన్నది నా అభిప్రాయం. గొప్పగా చెప్పుకోవాలని కొంతమంది పనులు చేస్తారు...కాని నాయుడుగారు చేసే పనులు గొప్పగా వుంటాయి. నాయుడు గారి స్టూడియో ముందు సముద్రం చిన్నబోయింది. చిన్నబోయిన సముద్రాన్ని చూసి విశాఖ విస్తుబోయింది. నాయుడుగారు తమవాడు కావటంతో సినిమా పరిశ్రమ మీసం మెలితిప్పింది. నాయుడుగారు..లాంగ్ లివ్......

3 కామెంట్‌లు:

  1. రామానాయుడు గారు సినిమానుంచి ఎంత పొందారో అంతకు అంత సినిమా పరిశ్రమకు చేశారు. కానీ ఏనాడూ చేసిన మేలు చెప్పుకోకపోవడమే ఆయనలోని గొప్పదనం. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఆయన పూర్తి అర్హత గల వ్యక్తి. ఆయనకు బహుకరించడం వల్ల ఆ అవార్డ్ ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుంది.

    రిప్లయితొలగించండి
  2. ఆయన సినెమా పరిశ్రమ కు చేసినదానికంటే, ఒక్క అయిదు ఏళ్లు MP గా ఉండి, ఓ ఆదర్శ రాజకీయనాయకుడు ఎలా ఉండాలో చూపారు, కాకపోతే ఆదర్శాలు ఇప్పటి రాజకీయనాయకులకు ఉండకూడదు అని జనాలు ఆయనకు తద్వారా ఎదయినా మంచి చేద్దామని రాజీకీయలలోకి (పొరపాటున) వచ్చే ప్రతి వానికి ఓ గుణపాఠం చెప్పారులు లెండి :((

    సినీ జీవులయినా ఆయన్ను గుర్తు పెట్టుకోవటం అభినందించదగిన విషయం. దానికి మీకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  3. రామానాయుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.... ఎదుటి వ్యక్తి హోదా తో సంబంధం లేకుండా ఆయన రిసీవ్ చేసుకునే పద్ధతి చూస్తే అబ్బురమని పిస్తుంది... ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి వుండే గొప్ప మనిషి... ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది... లాంగ్ లైవ్ రామానాయుడు గారు...
    థాంక్స్ ఏవియస్ గారు...

    రిప్లయితొలగించండి